
మాంచెస్టర్: వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరఫున ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన కీపర్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో షాయ్ హోప్ పట్టిన క్యాచ్‌లు 15 కాగా, అంతకుముందు జెఫ్ డజన్ ఈ ఫీట్ సాధించాడు. 1983లో జెఫ్ డజన్ ఆ రికార్డు నమోదు చేయగా, ఇప్పుడు అతని సరసన హోప్ నిలిచాడు. గురువారం భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షాయ్ హోప్ నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీల క్యాచ్‌లును హోప్ పట్టడంతో అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. ఒక వరల్డ్‌కప్‌లో విండీస్ తరఫున అత్యధిక కీపర్ క్యాచ్‌లు పట్టిన వారిలో షాయ్ హోప్-జెఫ్ డజన్‌ల తర్వాత స్థానాల్లో రిడ్లీ జాకబ్స్(14 క్యాచ్‌లు-1999 వరల్డ్‌కప్), దినేశ్ రామ్‌దిన్(13 క్యాచ్‌లు-2007, 2015ల్లో)లు ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(72; 82 బంతుల్లో 8 ఫోర్లు), కేఎల్ రాహుల్(48; 64 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(46; 38 బంతుల్లో 5 ఫోర్లు), ఎంఎస్ ధోని(56 నాటౌట్; 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు))లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.