ఫీల్డ్‌లోనే సహచర ఆటగాడ్ని కొట్టిన క్రికెటర్‌

Shahadat Suspended For Assault On Teammate - Sakshi

ఖుల్నా: క్రికెట్‌ మైదానంలోనే సహచర క్రికెటర్‌పై భౌతిక దాడికి పాల్పడిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షహదాత్‌ హుస్సేన్‌పై ఏడాది నిషేధం పడింది. బంగ్లాదేశ్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్‌-ఖుల్నా డివిజన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్‌ దాడికి పాల్పడ్డాడ్డు. బంతిని ఒకవైపే షైన్‌ చేయొద్దంటూ సహచర ఆటగాడు ఆరాఫత్‌ సన్నీ చెప్పడంతో ఆగ్రహానికి గురైన షహదాత్‌ దాడికి దిగాడు. ఫీల్డ్‌లో అంతా చూస్తుండగానే ఎందుకు షైన్‌ చేయకూడదంటూ ఆరాఫత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చి కొట్లాటను అడ్డుకున్నారు.

దీనిపై ఆరాఫత్‌ మాట్లాడుతూ.. బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదని షహదాత్‌కు చెప్పిన క్రమంలో అతను తనతో గొడవకు దిగాడన్నాడు. అదే సమయంలో తనను కొట్టాడని పేర్కొన్నాడు. దీనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)సీరియస్‌ అయ్యింది. జట్టులోని సహచర ఆటగాడిగాపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లెవల్‌ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై 12 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ నుంచి షహదాత్‌ వైదొలిగాల్సి వచ్చింది.

తాజా వివాదంపై షహదాత్‌ మాట్లాడుతూ.. ‘ నేను సస్పెండ్‌ అయిన కారణంగా ఎన్‌సీఎల్‌ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేను. నా సహనాన్ని కోల్పోయిన మాట వాస్తవం. కానీ అతను కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతన్ని చేయి చేసుకునే వరకూ వెళ్లాల్సి వచ్చింది. నేను బంతిని షైన్‌ చేస్తుంటే వద్దన్నాడు. ఎందుకు అని అడిగా. కానీ గట్టిగా అరుస్తూ నన్ను ఏదో అన్నాడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్రమంలోనే కొట్టాల్సి వచ్చింది’ అని తెలిపాడు. బంగ్లాదేశ్‌ తరఫున 38 టెస్టులు ఆడిన షహదాత్‌ 72 వికెట్లు తీశాడు.ఇక 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. 2015లో ఒకసారి షహదాత్‌పై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. భార్యను వేధించిన కేసులో షహదాత్‌ ఇరుక్కోవడంతో అతనిపై నిషేధం పడింది. ఆపై కొన్ని నెలలకు షహదాత్‌ అభ్యర్థన మేరకు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇచ్చింది. 2015లో బంగ్లాదేశ​ తరఫున షహదాత్‌ చివరిసారి ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top