నగరంలో సెపక్‌తక్రా సందడి

sepak takraw world cup starts from november 2nd

నవంబర్‌ 2 నుంచి ప్రపంచకప్‌

గచ్చిబౌలిలో పోటీల నిర్వహణ

ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం

దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: సెపక్‌తక్రా ప్రపంచకప్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్‌ 2 నుంచి 5 వరకు ఈ మెగా టోర్నీ జరగనున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ చెప్పారు. శుక్రవారం ఫతే మైదాన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ టోర్నీకి సంబంధించిన విశేషాలను ఆయన వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 16 అంతర్జాతీయ పురుషుల జట్లు, 12 మహిళల జట్లు తలపడనున్నట్లు పేర్కొన్నారు.

భారత్‌తో పాటు బ్రెజిల్, బ్రూనై, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇరాన్, జపాన్, మలేసియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్‌లో సెపక్‌తక్రా ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు ఉచితంగా ఎంట్రీ ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై టోర్నీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌లు దూరదర్శన్‌లో ప్రత్యక్షప్రసారం అవుతాయి. ఈ కార్యక్రమంలో క్రీడా సెక్రటరీ బి. వెంకటేశం, ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌బాబు, సెపక్‌తక్రా సమాఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top