క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సారా టేలర్‌

Sarah Taylor Retires From International Cricket - Sakshi

లండన్‌ : బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో తనదైన ముద్ర వేసిన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ ఆటకు గుడ్‌బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆట నుంచి వైదొలగడం కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇదే సరైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌ ప్రయాణంలో తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన జట్టు సహచరులు, స్నేహితులు.. అదే విధంగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డుకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మేరకు...‘ 2016లో నేను కన్న కల నిజమైంది. మూడేళ్ల ప్రయాణంలో ఎంతో సాధించాను. నా కెరీర్‌లో భాగంగా అత్యుత్తమ క్రికెటర్లతో కలిసి ఆడటం ఎంతో ఆనందంగా ఉంది. అయితే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. నా జీవితంలోని తదుపరి అధ్యాయానికి ఆహ్వానం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్‌ జెర్సీ ధరించిన ప్రతీ నిమిషాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా అంతర్జాతీయ కెరీర్‌లో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని సారా భావోద్వేగ పోస్టు పెట్టారు.

కాగా అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన వికెట్‌ కీపర్‌గా సారా టేలర్‌ గుర్తింపు పొందారు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 232 డిస్మిసల్స్‌తో రికార్డు నెలకొల్పారు. అదే విధంగా ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్‌గానూ ప్రాచుర్యం పొందారు. తన కెరీర్‌లో 126 వన్డేలు ఆడిన సారా.. 7 సెంచరీలతో పాటు 20 అర్ధసెంచరీలు సాధించారు. అదే విధంగా 90 టీ20 మ్యాచులు ఆడిన ఆమె.. 2,177 పరుగులు చేశారు. ఇక మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 6533 పరుగులు సాధించిన సారా.. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగారు. కాగా సారా రిటైర్మెంట్‌పై స్పందించిన ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ ఎండీ క్లేర్‌ కాన్నర్‌ మాట్లాడుతూ..‘ ఇంగ్లండ్‌ జెర్సీ ధరించిన సారా ఎన్నెన్నో విజయాల్లో సగర్వంగా భాగస్వామ్యమయ్యారు. మహిళా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top