నా కల సాకారం | Sania mirza interview | Sakshi
Sakshi News home page

నా కల సాకారం

Jul 13 2015 1:05 AM | Updated on Sep 3 2017 5:23 AM

నా కల సాకారం

నా కల సాకారం

భారతదేశం గర్వించదగ్గ మరో ఘనత... దేశంలో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచేలా మరో గొప్ప టైటిల్...

లండన్ : భారతదేశం గర్వించదగ్గ మరో ఘనత... దేశంలో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచేలా మరో గొప్ప టైటిల్... సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... రెండేళ్లుగా అసమాన ఆటతీరుతో చెలరేగుతున్న భారత టెన్నిస్ స్టార్ తాజాగా వింబుల్డన్‌లో మిహ ళల డబుల్స్ టైటిల్‌తో మరో ఘనతను సొంతం చేసుకుంది. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌లలోనూ ఏదో ఒక విభాగంలో టైటిల్ సాధించి కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసుకుంది. మార్టినా హింగిస్‌తో కలిసి ఫైనల్లో 5-7, 7-6 (7/4), 7-5తో రష్యా జోడి వెస్నినా, మకరోవాపై గెలిచింది. విజయం తర్వాత సానియా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...

 వింబుల్డన్ విజయం: చాంపియన్‌గా నిద్రలేవడం అనేది గొప్ప అనుభూతి. దీనిని వర్ణించడానికి మాటలు సరిపోవు. వింబుల్డన్ టైటిల్‌కు విలువ కట్టలేం. ఇది సాధించాలనేది నా కల. నా కెరీర్‌లో ఈ ఘనత సాధించడం, 4 గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం నా అదృష్టం.

అద్భుతమైన ఫైనల్: ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఎంత బాగా జరగాలో అలా జరిగింది. నలుగురం కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడాం. మా ప్రత్యర్థులు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా వాళ్ల సర్వీస్ చాలా బాగుంది. ఒక బ్రేక్ దొరికితే మరింత దూకుడుగా ఆడాలనేది మా వ్యూహం. దానిని అమలు చేసి ఫలితం సాధించాం.

 హార్డ్‌కోర్ట్ సీజన్‌పై గురి : త్వరలో హార్డ్‌కోర్ట్ సీజన్ ప్రారంభం కానుంది. దీనికోసం మరింత కష్టపడతాను. వింబుల్డన్‌లో సర్వీస్‌కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. హార్డ్‌కోర్టులలో మా శైలి ఆట ద్వారా ఫలితాలు ఎక్కువగా వస్తాయి. రాబోయే సీజన్‌లో మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాను.

 స్ఫూర్తి పెరిగితే సంతోషం : నా విజయం మరికొంతమంది భారతీయ మహిళల్లో స్ఫూర్తిని పెంచొచ్చు. నేను ఆడేది గెలవడం కోసం. ఆ గెలుపు ద్వారా మరింత మంది అమ్మాయిలు స్ఫూర్తి తెచ్చుకుని గెలిస్తే మరీ సంతోషం.

 ఆందోళన చెందలేదు: ఫైనల్లో వెనకబడ్డ సమయంలో ఆందోళన చెందలేదు. కెరీర్‌లో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం. ఇలాంటి వాటి మీద ఏళ్ల తరబడి కష్టపడ్డాం. కాబట్టి నియంత్రణతోనే ఆడాం.

 తప్పులు చేయకుండా ఆడాం: ఎట్టి పరిస్థితుల్లోనూ మన తప్పుల వల్ల మ్యాచ్ పోగూడదు. వాళ్లు గెలవాలంటే మనకంటే మెరుగ్గా ఆడాలి. అంటే మేం ప్రతి బంతినీ కోర్టులో సరైన ప్రదేశంలోకి పంపాలి. ఇదే వ్యూహంతో ఆడితే ఏదో ఒక సమయంలో ప్రత్యర్థులు తప్పు చేస్తారు. చివరికి అదే జరిగింది.

 అభినందనల వెల్లువ
 సానియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా అనేకమంది ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు.  ‘సానియా సాధించిన విజయం దేశంలో మహిళలకు ప్రేరణ ఇస్తుంది. నీతోపాటు దేశమంతా నీ విజయానికి సంబరం జరుపుకుంటోంది’ అని ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు.  ‘సానియా, హింగిస్ అద్భుతంగా ఆడారు. వింబుల్డన్‌లో మరపురాని విజయాన్ని నమోదు చేసి మమ్మల్ని గర్వపడేలా చేశారు’ అని ప్రధాని మోదీ తెలిపారు.

కేంద్ర మంత్రులు సోనోవాల్, అరుణ్ జైట్లీ కూడా ఇదే రీతిన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సానియా మీర్జా సాధించిన విజయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. ‘అంతర్జాతీయ టోర్నమెంట్స్ గెలుస్తూ హైదరాబాదీ అమ్మాయిలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సానియాకు నా అభినందనలు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సానియాను అభినందించారు.

 సంబరాలు లేవు : సానియా మీర్జాకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు అనేక మంది ప్రముఖులు ఫైనల్‌కు వెళ్లారు. బాలీవుడ్ హీరో, డెరైక్టర్ ఫర్హాన్ అక్తర్, పాకిస్తాన్ క్రికెటర్ అజహర్ మహమూద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ తదితరులు ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్ చూశారు. అయితే మ్యాచ్ అయిపోయేసరికి రాత్రి 10 గంటలు దాటిపోవడంతో సానియా-హింగిస్ సంబరాలేమీ చేసుకోకుండా హోటల్‌కు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement