లక్ష్మణ్‌పై అరిస్తే మా అన్న తిట్టాడు: సచిన్‌ | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 25 2018 6:27 PM

Sachin Shouted At VVS Laxman And Got Scolded His Brother - Sakshi

ముంబై: ఓ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ స్టార్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు తన సోదరుడితో తిట్లుతిన్నానని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. మంగళవారం వాంఖేడే వేదికగా ముంబై-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌కు హాజరైన ఈ దిగ్గజ క్రికెటర్లు సరదాగా చిట్‌చాట్‌ చేశారు. ఐపీఎల్‌లో ముంబైకి సచిన్‌, సన్‌రైజర్స్‌కు లక్ష్మణ్‌ మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

చిట్‌చాట్‌లో ఈ దిగ్గజ క్రికెటర్లు కోకకోలా కప్‌-1998లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా సచిన్‌ మ్యాచ్‌ మధ్యలో లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాడు. దీంతో ఇంటికెళ్లాక తన సోదరుడితో తిట్లు తిన్నానని.. ‘అతను నీ సహచర ఆటగాడు. అతను నీకు మద్దతునిస్తే.. నువ్వు అతనిపై అరిచావు.’ అని తన సోదరుడు మందలించినట్లు సచిన్‌ ఆనాటి విషయాలను వెల్లడించాడు. అయితే ఈ ఘటనపై లక్ష్మణ్‌కు అప్పుడే క్షమాపణలు చెప్పానని, మళ్లీ మైదానంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని మాస్టర్‌ చెప్పుకొచ్చాడు. ఇక నాన్‌ స్ట్రైకర్‌గా సచిన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ చూడటం తన అదృష్టమని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ఇది క్రికెట్‌లోనే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్‌(143) సెంచరీ చేసిన భారత్‌ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక కోకకోలా కప్‌ ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియాపై మరో సెంచరీతో చెలరేగి సచిన్‌ భారత్‌కు విజయాన్నందించాడు.

వాంఖేడే ప్రత్యేకం..
ముంబై వాంఖేడే మైదానం తనకు ప్రత్యేకమని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ‘ఈ మైదానం నాకు ప్రత్యేకం. నేనిక్కడి నుంచే నా ఆటను ప్రారంభించా. ఫ్టస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఇక్కడే అరంగేట్రం చేశా. 2011 ప్రపంచకప్‌ ఇక్కడే గెలిచాం. నా వీడ్కోలు మ్యాచ్‌ సైతం ఈ మైదానంలోనే జరిగింది. అందుకే వాంఖేడే నా జీవితంలో ప్రత్యేకమైన మైదానం.’’ అని సచిన్‌ తెలిపాడు.

Advertisement
Advertisement