రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఐపీఎల్-7 కోసం తమ ముగ్గురు స్టార్ క్రికెటర్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఐపీఎల్-7 కోసం తమ ముగ్గురు స్టార్ క్రికెటర్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లను తమ జట్టు తరఫున కొనసాగించనున్నట్లు తెలిపింది. ఐపీఎల్‌లో ఈ జట్టు సంచలన విజయాలలో ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషించారు. కోహ్లి తొలి సీజన్‌నుంచి ఆర్‌సీబీతోనే ఉండగా...గత మూడు సీజన్లనుంచి గేల్, డివిలియర్స్ ఆ జట్టు సభ్యులుగా ఉన్నారు.
ఐపీఎల్ తాజా నిబంధనల ప్రకారం ఈ ముగ్గురిని కొనసాగించేందుకు ఆర్‌సీబీ రూ. 29.5 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో వైపు ఆర్‌సీబీ తమ జట్టు హెడ్ కోచ్ రే జెన్నింగ్స్‌ను తొలగించి... ఆయన స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డానియెల్ వెటోరీని నియమించుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకుండా చురుకైన ఆటగాడిగా కొనసాగుతున్న 34 ఏళ్ల వెటోరీ కోచ్ బాధ్యతలు చేపట్టడం విశేషం. బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలన్ డొనాల్డ్ వ్యవహరిస్తారు. డొనాల్డ్ గత ఏడాది వరకు పుణే జట్టుతో పని చేశారు.
ఐదుగురు చొప్పున...
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము అట్టి పెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి శుక్రవారంలోగా సమర్పించాల్సి ఉంది. అయితే అధికారిక ప్రకటన చేయకపోయినా అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐదుగురు ఆటగాళ్లను కొనసాగించనున్నట్లు సమాచారం. చెన్నై టీమ్‌లో ధోని, రైనా, జడేజా, అశ్విన్ ఉండటం ఖాయం. ఐదో ఆటగాడిగా డ్వేన్ బ్రేవో లేదా డు ప్లెసిస్‌లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది. మరో వైపు సచిన్ టెండూల్కర్ లేకుండా ముంబై తొలి సారి ఐపీఎల్ బరిలోకి దిగబోతోంది. ఇందులో రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్‌లు ఖాయంగా ఉండవచ్చు.
దినేశ్ కార్తీక్‌కు కూడా అవకాశాలు ఉన్నాయి. మిషెల్ జాన్సన్, మలింగలలో ఒకరు... హర్భజన్, రాయుడులలో ఒకరిని ముంబై కొనసాగించవచ్చు. కోల్‌కతా గంభీర్, నరైన్, షమీలను వదులుకోకపోవచ్చు. రాజస్థాన్ జట్టు వాట్సన్, రహానే, శామ్సన్‌లను అట్టి పెట్టుకోవచ్చు. హైదరాబాద్ సన్‌రైజర్స్ కూడా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ధావన్, స్టెయిన్ మాత్రం ఉండే అవకాశం ఉంది. డారెన్ స్యామీ లేదా తాజా సంచలనం డి కాక్‌లలో ఒకరు కూడా ఉండవచ్చు.
కొత్తకొత్తగా...
మరో వైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాత్రం కొత్త సీజన్‌ను పూర్తిగా కొత్తగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమైన సెహ్వాగ్‌ను కూడా ఆ జట్టు వదులుకోవాలని భావిస్తోంది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కూడా కొనసాగించకపోవచ్చు. పంజాబ్ జట్టు కూడా దాదాపు అదే ఆలోచనతో ఉంది. అయితే గత సీజన్‌లో ఆకట్టుకున్న డేవిడ్ మిల్లర్‌పై కింగ్స్ ఎలెవన్ దృష్టి ఉంది.