శ్రీమతికి... ప్రేమికుల రోజు కానుక

 Rohit Sharma's Valentine's Day gift and message for wife  - Sakshi

ఐదో వన్డేలో సెంచరీపై రోహిత్‌  

పోర్ట్‌ ఎలిజబెత్‌: భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐదో వన్డేలో సాధించిన సెంచరీని తన శ్రీమతి రితిక సజ్దేకు ప్రేమికుల రోజు కానుకగా ఇస్తున్నట్లు చెప్పాడు. అతని శతకంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 4–1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్‌ మాట్లాడుతూ ‘విదేశీ గడ్డపై వన్డేల్లో మాకు ఇదే అతిపెద్ద సిరీస్‌ విజయం. ఈ ద్వైపాక్షిక  సిరీస్‌లో మేం అద్భుతంగా ఆడాం. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో (2007–08) కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌ గెలిచాం. అది కూడా క్లిష్ట పరిస్థితులను ఎదురొడ్డే సాధించాం. ఈ రెండు విజయాల్ని పోల్చలేం. అయితే ఈ వన్డే సిరీస్‌ గెలుపు మాకు చాలా ముఖ్యమైంది. తొలి వన్డే నుంచే మా ఆధిపత్యాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు విజయంతో సంతోషంగా ఉన్నాం. 25 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై సిరీస్‌ గెలవడంలో కుర్రాళ్ల పాత్ర ఎంతో ఉంది. అందరూ కఠిన సవాళ్లకు సిద్ధమయ్యారు. సమష్టిగా చెమటోడ్చి ఫలితం సాధించారు’ అని అన్నాడు. టెస్టు సిరీస్‌ ఓడినప్పటికీ ఏకపక్షంగా ముగియలేదని... ఆతిథ్య జట్టును దీటుగా ఎదుర్కొన్నామని చెప్పాడు.  

మా లక్ష్యం 5–1 
చరిత్ర సృష్టించిన ఈ విజయం మా జట్టు సమష్టి ప్రదర్శన. దక్షిణాఫ్రికా సిరీస్‌ కోల్పోయే ఒత్తిడిలో ఉందని గ్రహించాం. సిరీస్‌లో 4–1తో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. కానీ మేం 5–1తో ముగించాలని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కడ లోపాలున్నాయో చర్చించుకుంటాం. వచ్చే మ్యాచ్‌లో కొందరికి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాం. అయినా అంతిమ లక్ష్యం విజయమే. మూడో టెస్టు నుంచి మాకు మంచి సమయం నడుస్తోంది.  
–భారత కెప్టెన్‌ కోహ్లి  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top