రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు | Rohit Sharma Gets Another World Record | Sakshi
Sakshi News home page

రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు

Oct 19 2019 1:54 PM | Updated on Oct 19 2019 2:13 PM

Rohit Sharma Gets Another World Record - Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి  టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించిన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ.. మూడో టెస్టులో మరొక వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. 2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్‌ తాజా బద్ధలు కొట్టాడు.

కాగా, భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్‌. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 130 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక‍్సర్లతో శతకం సాధించాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇది రోహిత్‌కు టెస్టుల్లో 6వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం. అదే సమయంలో టెస్టుల్లో రెండు వేల పరుగుల్ని రోహిత్‌ పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్‌కు 30వ టెస్టు.

శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరితే, కాసేపటికి చతేశ్వర పుజారా డకౌట్‌ అయ్యాడు. 9 బంతులు ఆడిన పుజారా తన పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. కాగా, అటు తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. కాకపోతే దక్షిణాఫ్రికా పేసర్‌ నార్జీ వేసిన బంతికి కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తరుణంలో రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌.. ఆ తర్వాత వేగం పెంచాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. మరొకవైపు రహానే కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. రహానే నుంచి చక్కటి సహకారం లభించడంతో రోహిత్‌ రెచ్చిపోయి ఆడాడు. దాంతో త్వరగా సెంచరీ మార్కును చేరాడు. రోహిత్‌-రహానేలు 150కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్‌ గాడిలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement