‘యువ’ మెరుపుల్‌...

‘యువ’ మెరుపుల్‌... - Sakshi


ఐపీఎల్‌–10లో యువ ఆటగాళ్ల హవా



‘యువరాజ్, రైనాలను కలిపి చూస్తే రిషభ్‌ పంత్‌. అంతలా నన్ను ఆకట్టుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో అతను ఆడిన తీరు అద్భుతం. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ బౌలింగ్‌ సూపర్‌. సిరాజ్, థంపి భవిష్యత్‌ బౌలింగ్‌కు భరోసా కల్పించారు’ యువ కెరటాలపై సచిన్‌ కామెంట్స్‌ ఇవి. నిజమే... ఈ బ్యాటింగ్‌ దిగ్గజం అన్నట్లు ఐపీఎల్‌–10కు ఈ యువధీరులంతా కొత్త శోభ తెచ్చారు.       

    

– సాక్షి క్రీడావిభాగం

భవిష్యత్‌ ఆశాకిరణాల్లో కచ్చితంగా రిషభ్‌ పంత్‌ ఒకడు. 19 ఏళ్ల ఈ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చేజింగ్‌లో అతని ఎదురుదాడి అద్భుతం. తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరుకు చుక్కలు చూపించిన పంత్‌ (57)... ప్రత్యర్థి జట్టును ఓడించినంత పని చేశాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక గుజరాత్‌ లయన్స్‌ పాలిట సింహ స్వప్నంగా మారాడు. సిక్సర్ల జడివానతో పరుగుల వర్షం (56 బంతుల్లో 97; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) కురిపించాడు. ఐపీఎల్‌–10లో ఇది ఆరో అత్యుత్తమం. ఓవరాల్‌గా 165.61 స్ట్రయిక్‌ రేట్‌తో 366 పరుగులు చేశాడు.



ముంబై ఇండియన్స్‌ యువ సంచలనం నితీశ్‌ రాణా. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మన్‌ జట్టు కీలక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. చేజింగ్‌లో విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరు. కోల్‌కతాతో జరిగిన పోరులో భారీ లక్ష్యఛేదనలో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అతని జోరుముందు చక్కని బౌలింగ్‌ వనరులున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పప్పులూ ఉడకలేదంటే అతిశయోక్తికాదు. అనుభవజ్ఞులైన రోహిత్‌శర్మ, బట్లర్, పొలార్డ్‌లు విఫలమైన చోట వీరోచిత పోరాటం చేశాడు. ముంబైకి వరుస విజయాలందించాడు. గుజరాత్, పంజాబ్‌ల బౌలింగ్‌నూ చీల్చి చెండాడాడు. ఈ సీజన్‌లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లోనే 30.27 సగటుతో 333 పరుగులు చేశాడు.



రాహుల్‌ త్రిపాఠి... ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన బ్యాటింగ్‌ సెన్సేషన్‌. ధోని మార్గదర్శనంలో ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాట్స్‌మన్‌ వచ్చిన అవకాశాల్ని చక్కగా సద్విని యోగం చేసుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 391 పరుగులు చేసిన రాహుల్‌ ఈ సీజన్‌ టాప్‌–10 స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఓపెనింగ్‌లో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు)... కోల్‌కతాపై ఒంటిచేత్తో గెలిపించాడు. స్టోక్స్‌ సహా స్మిత్, ధోని పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన ఈడెన్‌ గడ్డపై సిక్సర్ల మోత మోగించాడు.



యార్కర్ల సూపర్‌ పేసర్‌ బాసిల్‌ థంపి. ఈ లీగ్‌లో గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆకట్టుకున్న యువ బౌలర్‌. వికెట్ల పరంగా (11) గొప్ప ప్రదర్శన కాకపోవచ్చు. కానీ అతని బౌలింగ్‌ తీరు... దూసుకెళ్లే బంతుల్లో పదును... అంత ఆషామాషీ కాదు. అందుకే ఐపీఎల్‌ జ్యూరీ అతని ప్రదర్శనను గుర్తించింది. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అవార్డును అందించింది. గంటకు 140 కి.మీ. స్థిరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ వెన్నులో వణుకు పుట్టించే సహజమైన శైలి అతని సొంతం. అతని షోకు ఒక్క సచినే కాదు... భారత కెప్టెన్‌ కోహ్లి, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కితాబిచ్చారు.



విదేశీ ఆటగాళ్లలో సూపర్‌ సర్‌ప్రైజ్‌ మాత్రం సునీల్‌ నరైన్‌దే! కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత టైటిల్‌ విజయాలకు స్పిన్‌ మంత్రాన్ని నమ్ముకుంది. కానీ ఈసారి బ్యాట్‌తో అది కూడా... ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా నరైన్‌ ఆల్‌రౌండర్‌ అవతారమెత్తాడు. అతని దూకుడు ఎలా ఉందంటే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా ఆ వేగాన్ని అందుకోలేకపోయారు. అందుకే ఈ సీజన్‌లోనే వేగవంతమైన అర్ధసెంచరీ అవార్డు అతని బ్యాట్‌నే వరించింది. ఈ సీజన్‌లో నరైన్‌ 172.30 స్ట్రయిక్‌ రేట్‌తో 224 పరుగులు చేశాడు. మేటి బ్యాట్స్‌మెన్‌ అయిన డివిలియర్స్‌ (216), గేల్‌ (200), యూసుఫ్‌ పఠాన్‌ (143), కోరే అండర్సన్‌ (142)ల కంటే ముందు వరుసలో ఉన్నాడు. అలాగని బౌలింగ్‌లో విఫలం కాలేదు. 6 పరుగుల ఎకానమి రేట్‌తో 10 వికెట్లు కూడా తీశాడు. బెంగళూరుపై నరైన్‌ 15 బంతుల్లోనే చేసిన అర్ధసెంచరీ ఈ టోర్నీలోనే హైలైట్‌గా నిలిచింది.



వేలంలో అందరి కళ్లు బెన్‌ స్టోక్స్‌పైనే! అంచనాలకు అనుగుణంగా రూ.14.5 కోట్లతో రైజింగ్‌ పుణే పంచన చేరిన స్టోక్స్‌... కొన్ని ఆరంభ మ్యాచ్‌ల్లో తేలిపోయినా... తర్వాత తన విలువేంటో చూపాడు. ఈ సీజన్‌లో నమోదైన ఐదు సెంచరీల్లో అతనిదీ ఓ శతకముంది. మరో వైపు రూ. 12 కోట్లు పెట్టి బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు అతను ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐదు మ్యాచ్‌లే ఆడిన అతను ఐదు వికెట్లు తీసి నిరాశపరిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top