సీఓఏకు విజ్ఞప్తి చేశా.. కానీ వారు వినలేదు: గంగూలీ

Requested To The CoA But They Have Not Listened Ganguly - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కొత్త అధ్యక్షుడిగా తన నియామకం దాదాపు ఖరారైన తరుణంలో భవిష్య కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుని రేసులో ముందంజలో ఉన్న గంగూలీ.. తన తొలి ప్రాధాన్యత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కేనంటూ స్పష్టం చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ ఆధారంగా క్రికెటర్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే అప్పుడు మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం ఉందన్నాడు. ఈ విషయాన్ని గతంలో క్రికెట్‌ పరిపాలక కమిటీ(సీఓఏ)కు చెప్పినా, దాన్ని పెడచెవిన పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు ప్రాధాన్యత అనేది ఒక్క రూల్‌. దానిపైనే ప్రధానంగా దృష్టి పెడతా. నా తొలి ప్రాముఖ్యత ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకే. ఇదే విషయాన్ని సీఓఏకు విజ్ఞప్తి చేశా.. కానీ వారు పట్టించుకోలేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రంజీ ట్రోఫీ అనేది చాలా కీలకం. ఆర్థికపరమైన ఆసక్తి ఎక్కువ ఉన్న క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలి’ అని గంగూలీ పేర్కొన్నాడు.తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా చేయడానికి బీసీసీఐ మెజారిటీ రాష్ట్ర యూనిట్లు మద్దతు తెలపడాన్ని పెద్ద బాధ్యతగా గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ సంస్థ అయిన బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, చాలా సంతోషంగా కూడా ఉన్నానని తెలిపాడు.  బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది.  ఢిల్లీలో శనివారం అమిత్‌ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ బోర్డు అధ్యక్షుడు ఖాయమని వినిపించింది.

అయితే 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరగా... గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దాంతో శ్రీనివాసన్‌ వర్గానికి చెందిన బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది.  అయితే చివరకు ఎక్కువ సంఘాలు బ్రిజేష్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌... బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్‌ వరకూ మాత్రమే కొనసాగగలడు. కొత్త నిబంధనల ప్రకారం అతను విరామం తీసుకోవాల్సి ఉంటుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top