అదిరే 'ముగింపు' కోసం

Relentless India eye 5-1 against South Africa - Sakshi

సెంచూరియన్‌: గతంలో ఆరు సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా.. ఈసారి విరాట్‌ కోహ్లి నేతృత్వంలో సగర్వంగా ఒడిసిపట్టుకుంది. అది కూడా 4-1 తేడాతో సిరీస్‌ గెలిచి సఫారీలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. దాంతో దక్షిణాఫ్రికాపై వారి దేశంలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధికంగా మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఆ జట్టు నుంచి నంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో విజయం కన్నేసిన టీమిండియా వన్డే సిరీస్‌కు అదిరిపోయే ముగింపు ఇవ్వాలని భావిస్తోంది. అదే సమయంలో మూడు టీ 20ల సిరీస్‌కు ఘనంగా సన్నద్ధం కావాలని యోచిస్తోంది. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన ఆరో వన్డే శుక్రవారం జరుగనుంది. సెంచూరియన్‌ వేదికగా సాయంత్రం గం. 4.30ని.లకు(భారత కాలమాన ప్రకారం) మ్యాచ్‌ ఆరంభం కానుంది.

టీమిండియా వరుసగా డర్బన్‌, సెంచూరియన్‌, కేప్‌టౌన్‌ వన్డేల్లో విజయం సాధించి ముందుగానే సిరీస్‌పై పట్టుసాధించింది. అయితే జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. వర్షం కారణంగా డక్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. దాంతో పోర్ట్‌ ఎలిజబెత్‌లో వన్డేపై ఆసక్తి నెలకొంది. కాగా, టీమిండియా 73 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో భారత జట్టు నామమాత్రపు ఆఖరి వన్డేకు సిద్ధమవుతుండగా, దక్షిణాఫ్రికా మరో గెలుపును సొంతం చేసుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

ప్రయోగాలపై దృష్టి!

దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ప్రయోగాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. దాంతో రేపటి మ్యాచ్‌లో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఆరో వన్డేలో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. దాంతో అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే శ్రేయస్‌ అయ్యర్‌, చాహల్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

మరో రికార్డు సాధిస్తారా!

భారత జట్టును మరో రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌ ముందు వరకూ సఫారీ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధికంగా రెండు వన్డేలు(రెండు సందర్భాల్లో) మాత‍్రమే గెలిచిన టీమిండియా.. తాజా సిరీస్‌లో ఐదో వన్డే విజయంపై కన్నేసింది. ఆఖరి వన్డేను విజయంతో ముగిస్తే సఫారీలపై వారి గడ్డపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన తొలి భారత జట్టుగా విరాట్‌ సేన నిలుస్తుంది. అదే క్రమంలో విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లో ఐదు వన్డేలను మూడోసారి మాత్రమే గెలిచిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. అంతకుముందు 2013లో జింబాబ్వేతో వారి గడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. 2017లో శ్రీలంకతో వారి దేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. ఈసారి సఫారీలపై ఐదు వన్డేలు గెలిచే అవకాశం రావడంతో మరి దాన్ని టీమిండియా సాధిస్తుందో.. లేదో చూడాలి.

తుది జట్లు(అంచనా)

భారత్‌..

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ , బూమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌

దక్షిణాఫ్రికా..

మర్‌క్రామ్‌(కెప్టెన్‌), హషీమ్‌ ఆమ్లా, డుమినీ, డేవిడ్‌ మిల్లర్‌, ఏబీ డివిలియర్స్‌, మోర్నీ మోర్కెల్‌, ఎన్‌గిడి, రబడా, ఫెహ్లికోవాయో, షమ్సీ, క్లాసెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top