ఆడకుండా.. నన్ను కిడ్నాప్‌ చేశారు: అశ్విన్‌

Ravichandran Ashwin Says He Was Kidnapped In Teenage - Sakshi

చెన్నై: తనను క్రికెట్‌ మ్యాచ్‌ ఆడనీయకుండా ‘ప్రత్యర్థి జట్టు’ అభిమానులు కిడ్నాప్‌ చేశారని టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. బజ్జీలు, వడలు కొనిపెట్టి.. బంతి విసిరితే.. చేతివేళ్లు కత్తిరిస్తామని చాలా మర్యాదగా హెచ్చరించారని చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టులో ఒకప్పుడు టాప్‌ స్పిన్నర్‌గా వెలుగొందిన అశ్విన్‌.. క్రికెట్‌ మ్యాచ్‌ కారణంగా తాను టీనేజ్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకున్నాడు. ‘‘బాల్యంలో నా స్నేహితులతో కలిసి రోడ్ల మీద క్రికెట్‌ ఆడేవాడిని. అయితే మా నాన్నకు ఈ విషయం ఎంతమాత్రం నచ్చేది కాదు. అలాంటి సమయంలో ఒకానొక రోజు మేం ప్రత్యర్థి జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడాల్సి వచ్చింది. ఆరోజు ఓ నలుగురు వ్యక్తులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ మీద వచ్చారు. పద మనం వెళ్లాలి అంటూ తొందరపెట్టారు. దాంతో డౌట్‌ వచ్చి మీరెవరు అని ప్రశ్నించాను.

నువ్విక్కడ మ్యాచ్‌ ఆడుతున్నావంట కదా. అందుకే తీసుకువెళ్లడానికి వచ్చాం. పద అన్నారు. వాళ్ల మాటలు విని.. అబ్బో నాకోసం బండి పంపించారా అని సంబరపడ్డాను. తర్వాత పాష్‌ ఏరియాలో టీ షాపునకు నన్ను తీసుకువెళ్లారు. బజ్జీలు, వడలు కొనిపెట్టారు. నువ్వేం భయపడకు..నీతోనే ఉంటాం అని చెప్పారు. ఇంతలో మ్యాచ్‌కు టైం అయ్యిందని వాళ్లను తొందర పెట్టగా.. మెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వాళ్లు ప్రత్యర్థి జట్టుకు చెందిన వాళ్లట. మ్యాచ్‌ ఆడితే నా చేతివేళ్లు కట్‌ చేస్తామన్నారు. సరే నేను ఎక్కడికీ వెళ్లను అని చెప్పాను. ఆ తర్వాత వాళ్లే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు’’అని అశ్విన్‌ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా అశ్విన్‌ టెస్టు ఫార్మాట్‌కే పరిమితం అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌ వంటి యువ స్పిన్నర్లు భారత జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా మారిపోవడంతో అశ్విన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top