
ఐపీఎల్లో ఆఫ్ఘాన్ ముద్ర..
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో పలువురు భారత సీనియర్ క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైతే.. తొలిసారి వేలం బరిలో నిలిచిన ఆఫ్ఘానిస్తాన్ మాత్రం ఆకట్టుకుంది.
ముంబై:ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంపాటలో పలువురు భారత సీనియర్ క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైతే.. తొలిసారి వేలం బరిలో నిలిచిన ఆఫ్ఘానిస్తాన్ మాత్రం ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ పరంగా అనుభవం పెద్దగా లేకపోయినప్పటికీ ఆఫ్ఘాన్ తన ప్రత్యేక ముద్రతో ఐపీఎల్ వేదికపై మెరిసింది. ఒక అసోసియేట్ దేశంగా అతి కొద్ది మంది సభ్యులతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి బరిలో నిలిచిన ఆఫ్ఘాన్.. వేలంలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది.
ఐపీఎల్ వేలానికి వచ్చిన ఐదుగురు ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్ లు బరిలో ముందు వరసులో నిలిచారు. ఈ ఇద్దర్నీ సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తొలుత మొహ్మద్ నబీని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్.. ఆ తరువాత రషీద్ ఖాన్ కు రూ.4 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. వీరిలో నబీ ఆల్ రౌండర్ కాగా, రషీద్ ఖాన్ లెగ్ బ్రేక్ బౌలర్.
మరొకవైపు ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ఆటగాడిగా నబీ గుర్తింపు పొందడం ఇక్కడ విశేషం. ఇటీవల రషీద్ తన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ అతనికి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. ఇప్పటివరకూ రషీద్ 18 వన్డేల్లో 31 వికెట్లు తీశాడు. అందులో అతని అత్యుత్తమం 4/21 కాగా, 21 ట్వంటీ 20 మ్యాచ్ ల్లో 31 వికెట్లను సాధించాడు.