కుల్దీప్‌ తిప్పేశాడు

కుల్దీప్‌ తిప్పేశాడు


వెస్టిండీస్‌తో రెండో వన్డే

105 పరుగులతో భారత్‌ విజయం

30న మూడో వన్డే  






పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: అజింక్య రహానే అద్భుత సెంచరీతో భారీ స్కోరు సాధించిన భారత్‌... ఆ తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ (3/50) తన మేజిక్‌ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ భరతం పట్టాడు. దీంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 105 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాయ్‌ హోప్‌ (88 బంతుల్లో 81; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోగలిగాడు.



ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లి సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈనెల 30న ఆంటిగ్వాలో జరుగుతుంది. ఇక తొలి ఓవర్‌ మూడో బంతికే పావెల్‌ వికెట్‌ తీసిన భువనేశ్వర్‌ తన మరుసటి ఓవర్‌లో జేసన్‌ మొహమ్మద్‌ను కూడా పెవిలియన్‌కు పంపడంతో విండీస్‌ ఆది నుంచే తడబడింది. ఆ తర్వాత కుల్దీప్‌ చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరి తన ‘తొలి’ వన్డేలోనే ఆకట్టుకోగలిగాడు. హోప్, లూయిస్‌ (21) మధ్య మూడో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే 26వ ఓవర్‌లో హోప్‌ను కుల్దీప్‌ ఎల్బీగా అవుట్‌ చేశాక పరుగుల వేగం తగ్గింది. అటు రన్‌రేట్‌ కూడా 12కు పెరిగిపోవడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసినా లక్ష్యం వైపు పయనించలేకపోయింది. రహానేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.



స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: 310/5; విండీస్‌ ఇన్నింగ్స్‌: పావెల్‌ (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 0; హోప్‌ ఎల్బీడబ్ల్యూ (బి) కుల్దీప్‌ 81; జేసన్‌ మొహమ్మద్‌ (సి) పాండ్యా (బి) భువనేశ్వర్‌ 0; లూయిస్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్దీప్‌ 21; కార్టర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్‌ 13; హోల్డర్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్దీప్‌29; చేజ్‌ నాటౌట్‌ 33; నర్స్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో ఆరు వికెట్లకు) 205.



వికెట్ల పతనం: 1–0, 2–4, 3–93, 4–112, 5–132, 6–174.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 5–1–9–2; ఉమేశ్‌ యాదవ్‌ 6–0–36–0; హార్దిక్‌ పాండ్యా 9–0–32–0; అశ్విన్‌ 9–0–47–1; కుల్దీప్‌ 9–0–50–3; యువరాజ్‌ 5–0–25–0.



వన్డేల్లో 300కు పైగా పరుగులు స్కోరు చేయడం భారత్‌కిది 96వ సారి. గతంలో ఆసీస్‌ (95)పేరిట ఈ రికార్డు ఉంది.



కరీబియన్‌లో విండీస్‌పై భారత్‌కిదే అతిపెద్ద విజయం.



ధావన్, రహానే భాగస్వామ్య సగటు 76. వన్డేల్లో ఏ జోడీకి కూడా ఈ స్థాయి సగటు లేదు.



రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత వెస్టిండీస్‌లో వన్డే సెంచరీ చేసిన  ఓపెనర్‌గా రహానే.



రహానే మాపై ఒత్తిడి తగ్గించాడు...

అజింక్య రహానేతో జట్టులో చక్కటి సమతూకం ఏర్పడింది. కొద్దికాలంగా రహానే జట్టు వన్డే సెటప్‌లో ఉన్నాడు. టాప్‌ ఆర్డర్‌లో అతను కీలకం అవుతాడని మేం ముందే ఊహించాం. మూడో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా అతను సిద్ధంగా ఉంటున్నాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ అతడి ఆట అద్భుతం. తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. మిడిలార్డర్‌లో కూడా తను రాణించగలడు కాబట్టి ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీలో అదనపు బౌలర్‌తో బరిలోకి దిగేందుకు అనువుగా ఉంటుంది. డ్రై వికెట్‌పై తాను ఎంత ప్రమాదకరమో కుల్దీప్‌ చాటిచెప్పాడు. ఇక వచ్చే ప్రపంచకప్‌ గురించి మాట్లాడుకుంటే 15 మంది ఆటగాళ్లు ఇక్కడ ఉన్నారు. మరో 12 మంది భారత్‌లో సిద్ధంగా ఉన్నారు. ఒత్తిడిని జయించి మధ్య ఓవర్లలో ఎవరు మెరుగ్గా రాణించగలరో గుర్తించాల్సి ఉంది.

–కోహ్లి, భారత్‌ కెప్టెన్‌



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top