సింధు, శ్రీకాంత్‌ నిష్క్రమణ | PV Sindhu & Srikanth Out of China Open; India's Campaign Ends | Sakshi
Sakshi News home page

సింధు, శ్రీకాంత్‌ నిష్క్రమణ

Sep 22 2018 1:05 AM | Updated on Sep 22 2018 1:05 AM

PV Sindhu & Srikanth Out of China Open; India's Campaign Ends - Sakshi

చాంగ్జౌ: ఈ ఏడాది భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మరో ‘సూపర్‌’ టోర్నమెంట్‌ నిరాశను మిగిల్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 చైనా ఓపెన్‌లో భారత్‌ కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్స్‌ బరిలో నిలిచిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఆ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 11–21, 21–11, 15–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా) చేతిలో పోరాడి ఓడగా... పురుషుల సింగిల్స్‌ విభాగం మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 9–21, 11–21తో ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో నిష్క్రమించిన సింధు, శ్రీకాంత్‌లకు 5,500 డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

గతేడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌తో దుమ్మురేపిన శ్రీకాంత్‌ ఈ ఏడాది అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కెంటో మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ కేవలం 28 నిమిషాల్లోనే చేతులెత్తేశాడు. శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో ఓసారి వరుసగా ఎనిమిది పాయింట్లు... రెండో గేమ్‌లో ఓసారి వరుసగా తొమ్మిది పాయింట్లు కోల్పోవడం గమనార్హం. ఓవరాల్‌గా మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది ఎనిమిదో పరాజయంకాగా వరుసగా ఐదో ఓటమి. గతంలో చెన్‌ యుఫెపై నాలుగుసార్లు గెలిచిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో సింధు తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 14–12 వద్ద చెన్‌ యుఫె వరుసగా నాలుగు పాయింట్లు స్కోరు చేసి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement