తొడగొట్టే టైమొచ్చింది | Pro Kabaddi League 2018 starts today | Sakshi
Sakshi News home page

తొడగొట్టే టైమొచ్చింది

Oct 7 2018 12:23 AM | Updated on Oct 7 2018 12:23 AM

Pro Kabaddi League 2018 starts today - Sakshi

కబడ్డీ కూతకు మళ్లీ రంగం సిద్ధమైంది. అమిత వేగంగా అభిమానులకు చేరువైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరోసారి ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఐదు సీజన్లలో అద్భుతంగా చెలరేగిన ఆటగాళ్లు ఉండి కూడా ఇటీవల ఆసియా క్రీడల్లో భారత జట్టు పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో లీగ్‌లో మళ్లీ తొడగొట్టి ఫ్యాన్స్‌ మనసులు గెలుచుకోవాలని ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. గత ఏడాదిలాగే దాదాపు మూడు నెలల సుదీర్ఘ  సమయం పాటు టోర్నీ   సాగనుంది.  

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ నేటి నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. తొలి రోజు జరిగే మ్యాచ్‌లలో తమిళ్‌ తలైవాస్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌... పుణేరీ పల్టన్‌తో యు ముంబా తలపడతాయి. మొత్తం 12 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. మంగళవారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తమిళ్‌ తలైవాస్‌ను తెలుగు టైటాన్స్‌ ఎదుర్కొంటుంది. కొచ్చిలో ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగనుండగా... జనవరి 5న ముంబైలో ఫైనల్‌ నిర్వహిస్తారు. ఐదు సీజన్లలో గత మూడు సార్లు వరుసగా పట్నా పైరేట్స్‌ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగే ప్రారంభ కార్యక్రమంలో శ్రుతి హాసన్‌ షో ప్రధాన ఆకర్షణ కానుండగా...మరో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కూడా ఇందులో పాల్గొంటాడు.  

డిసెంబర్‌ 7 నుంచి వైజాగ్‌లో! 
ఆరో సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ను మొత్తం 13 వేదికల్లో నిర్వహిస్తారు. 12 టీమ్‌ల సొంత వేదికలతో పాటు టీమ్‌ లేకపోయినా కేరళలో కబడ్డీని ప్రమోట్‌ చేసేందుకు కొచ్చిలో మ్యాచ్‌లు జరుపుతున్నారు. తెలుగు టైటాన్స్‌ కేంద్రం హైదరాబాద్‌ అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 7 నుంచి 13 వరకు జరగాల్సిన మ్యాచ్‌లను వైజాగ్‌కు తరలించినట్లు సమాచారం. లీగ్‌ వేలంలో భారీ మొత్తాలు పలికిన ఆటగాళ్లపై ఈ సారి అందరి దృష్టి నెలకొంది. హరియాణా స్టీలర్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న మోనూ గోయత్‌ అత్యధికంగా రూ.1.51 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోటి దాటిన ఇతర ఆటగాళ్లలో రాహుల్‌ చౌదరి (1.29), దీపక్‌ హుడా (1.15) కూడా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement