నేడు పీబీఎల్‌ వేలం

Premier Badminton League auction today

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ పీవీ సింధుపై అన్నీ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. మెగా టోర్నీల్లో దూసుకెళ్తున్న తెలుగు తేజంపై రూ. లక్షలు వెచ్చించేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సై అంటున్నాయి. ఆమెతో పాటు ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సన్, మహిళల నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (తైవాన్‌), భారత స్టార్‌ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. సోమవారం ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 2.12 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఒక ప్లేయర్‌పై రూ. 72 లక్షలకు మించరాదు.

కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, జర్మనీ, హాంకాంగ్, చైనా, స్పెయిన్‌ తదితర మొత్తం 11 దేశాలకు చెందిన 133 మంది ప్లేయర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ఇందులో సింహభాగం 82 మంది భారత ఆటగాళ్లే ఉన్నారు. ఆశ్చర్యకరంగా చైనా కూడా ఈ సారి తమ ఆటగాళ్లను బరిలోకి దించింది. ప్రపంచ 11వ ర్యాంకర్‌ తియాన్‌ హైవీ వేలంలో మంచి ధర పలకొచ్చు. పీబీఎల్‌ మూడో సీజన్‌లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు చోటిచ్చారు. దీంతో మొత్తం 8 ఫ్రాంచైజీలు టైటిల్‌ కోసం తలపడతాయి. డిసెంబర్‌ 22 నుంచి జనవరి 14 వరకు 24 రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌ సహా ముంబై, లక్నో, చెన్నై, గువాహటిలో పోటీలు నిర్వహిస్తారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top