బ్రిడ్జ్‌లో జయకేతనం 

Pranab Bardhan, Shibhnath Sarkar win bridge gold for India - Sakshi

అరంగేట్ర క్రీడలో స్వర్ణం నెగ్గిన భారత్‌

దేశం తరఫున పతకం గెలిచిన పెద్ద వయస్కుడిగా ప్రణబ్‌ రికార్డు  

ఏషియాడ్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడాంశం  ‘బ్రిడ్జ్‌’లో భారత్‌ స్వర్ణం గెల్చుకుంది. శనివారం పురుషుల పెయిర్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత్‌ జోడీ ప్రణబ్‌ బర్దన్, శివ్‌నాథ్‌ సర్కార్‌ 384 పాయింట్లు స్కోరు చేశారు. ప్రత్యర్థి చైనా జంట లిగ్జిన్‌ యాంగ్, గాంగ్‌ చెన్‌ 378 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. ఇండోనేసియా (374 పాయింట్లు), హాంకాంగ్‌ (373 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో 60 ఏళ్ల బర్దన్‌... అత్యంత పెద్ద వయసులో పతకం గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అతడి సహచరుడు శివ్‌నాథ్‌ వయసు 56 ఏళ్లు కావడం విశేషం. మరోవైపు మిక్స్‌డ్‌ పెయిర్‌ ఫైనల్లో భారత్‌ జంట బాచిరాజు సత్యనారాయణ, కిరణ్‌ 333 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది. బ్రిడ్జ్‌లో మన దేశానికి ఒక స్వర్ణం (పురుషుల పెయిర్‌), రెండు కాంస్యాలు (పురుషుల టీమ్, మిక్స్‌డ్‌ టీమ్‌) లభించాయి. 

జూద క్రీడ కాదు... 
అందరూ భావించినట్లు బ్రిడ్జ్‌ జూద క్రీడ కాదని... నైపుణ్యం, అదృష్టం కలగలిసిన ఆట అని అంటున్నారు బర్దన్‌. చెస్‌లాగానే మేధో క్రీడ అని, దానికంటే మరింత చాలెంజింగ్‌ అని అభివర్ణిస్తున్నారు. అందరికీ మొదటి సెట్‌ కార్డులే వస్తాయి కాబట్టి, పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడినవారే విజేతగా నిలుస్తారని చెబుతున్నాడు. ఇది అన్ని వయసుల వారు ఆడే క్రీడ అని శివ్‌నాథ్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు.  ఫైనల్‌ ముందు రాత్రి తాను నిద్ర పోలేదని, ఉదయం కేవలం పండ్లు మాత్రమే తీసుకుని బరిలో దిగానని సర్కార్‌ చెప్పడం విశేషం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top