
ముంబై: రైడర్ ప్రదీప్ నర్వాల్ సంచలన ప్రదర్శనతో పట్నా పైరేట్స్‌కు ఎదురులేని విజయాన్నందించాడు. అతనొక్కడే 34 రైడ్ పాయింట్లతో పీకేఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తే... హరియాణా స్టీలర్స్ జట్టంతా కలిసి 30 పాయింట్లను మించి చేయలేకపోయింది. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో సోమవారం జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో పట్నా 69–30 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై జయభేరి మోగించింది. 32 సార్లు రైడింగ్‌కు వెళ్లిన ప్రదీప్ నర్వాల్ 34 పాయింట్లు సాధించడం విశేషం.
అతని జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటైంది. మోను గోయత్ 10, విజయ్ 5 పాయింట్లు చేయగా... టాకిల్‌లో జైదీప్ (7) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన తొలి ఎలిమినేటర్ పోరులో పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధపై గెలిచింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్, మూడో ఎలిమినేటర్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.