దబంగ్‌ ఢిల్లీ ఫైనల్‌కు  | Dabang Delhi book finals berth after clinching thrilling tiebreaker win against Puneri Paltan | Sakshi
Sakshi News home page

దబంగ్‌ ఢిల్లీ ఫైనల్‌కు 

Oct 28 2025 5:04 AM | Updated on Oct 28 2025 5:04 AM

Dabang Delhi book finals berth after clinching thrilling tiebreaker win against Puneri Paltan

ఉత్కంఠరేపిన టైబ్రేకర్‌లో పుణేరి పల్టన్‌పై గెలుపు  

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో రెండో టైటిల్‌ సాధించేందుకు దబంగ్‌ ఢిల్లీ సిద్ధమైంది. 2021 చాంపియన్‌ ఢిల్లీ మూడేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సోమవారం రసవత్తరంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో దబంగ్‌ ఢిల్లీ టైబ్రేకర్‌లో 6–4 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌పై గెలిచింది. ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి మ్యాచ్‌ 34–34 స్కోరు వద్ద ‘టై’ అయ్యింది. 

దబంగ్‌ జట్టులో నీరజ్‌ నర్వాల్‌ (7) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. 14 సార్లు కూతకెళ్లిన అతను ఏడుసార్లు పాయింట్లను తెచ్చిపెట్టాడు. 3 సార్లు మాత్రం అవుటయ్యాడు. కెపె్టన్‌ ఆశు మలిక్‌ రెయిడింగ్‌లో 4 పాయింట్లు చేశాడు. డిఫెండర్లలో సౌరభ్, సందీప్‌ చెరో 3 పాయింట్లు చేయగా, సుర్జీత్‌ సింగ్, ఫజల్‌ అత్రాచలి, అజింక్య పొవార్‌ తలా 2 పాయింట్లు చేశారు. పుణేరి పల్టన్‌ తరఫున ఆదిత్య షిండే (10) రాణించాడు.

 18 సార్లు కూతకెల్లిన అతను 8 సార్లు బోనస్‌ సహా విజయవంతగా పాయింట్లు తెచ్చాడు. పంకజ్‌ మోహితే (5) కూడా జట్టును గెలిపించేందుకు తీవ్రంగా చెమటోడ్చారు. డిఫెండర్లలో గౌరవ్‌ ఖత్రి (4), గుర్‌దీప్, అభినేశ్‌ చెరో 3 పాయింట్లు చేశారు. పీకేఎల్‌లో దబంగ్‌కిది మూడో ఫైనల్‌! 2019 సీజన్‌లోనూ తుదిపోరుకు అర్హత సంపాదించినప్పటికీ... బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో టైటిల్‌ను కోల్పోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 పట్టికలో టాప్‌–2లో నిలిచిన జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఓడినంత మాత్రాన పుణేరి టైటిల్‌ ఆశలకు తెరపడలేదు. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో పుణేరి పల్టన్‌ ఫైనల్‌ బెర్తు కోసం మళ్లీ తలపడుతుంది. రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌ 46–37తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. నేడు జరిగే మూడో ఎలిమినేటర్‌లో తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ విజేతతోనే పుణేరి తలపడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement