ఇంగ్లండ్‌ బయలుదేరిన పాకిస్తాన్‌ జట్టు 

Pakistan Cricket Players Departs For England Tour - Sakshi

మాంచెస్టర్‌: ఓవైపు కరోనా తాలూకు భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం ఆదివారం ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం మాంచెస్టర్‌ పయనమైంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో ఇరు జట్ల మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరినట్టుగా పాక్‌ వన్డే, టి20 కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

‘ఇంగ్లండ్‌కు వెళ్లే దారిలో ఉన్నాం. ఈ పర్యటన కోసం ఎంతోకాలంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా’ అని పేర్కొన్న బాబర్‌ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను పంచుకున్నాడు. అయితే కరోనా బారిన పడిన 10 మంది క్రికెటర్లను మళ్లీ పరీక్షించగా అందులో ఆరుగురు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ వారిని మరోమారు పరీక్షించాకే ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది.   

పాకిస్తాన్‌ జట్టు: అజహర్‌ అలీ, బాబర్‌ ఆజమ్, అబిద్‌ అలీ, అసద్‌ షఫీఖ్, ఫహీమ్‌ అష్రఫ్, ఫవాద్‌ ఆలమ్, ఇఫ్తికార్‌ అహ్మద్, ఇమాద్‌ వసీమ్, ఇమాముల్‌ హఖ్, ఖుష్‌దిల్‌ షా, మొహమ్మద్‌ అబ్బాస్, మూసా ఖాన్, నసీమ్‌ షా, రోహైల్‌ నాజిర్, సర్ఫరాజ్‌ అహ్మద్, షహీన్‌ షా అఫ్రిది, షాన్‌ మసూద్, సొహైల్‌ ఖాన్, ఉస్మాన్‌ షిన్వారీ, యాసిర్‌ షా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top