
కోహ్లి-డుప్లెసిస్ కరాచలనం
డర్బన్: వన్డే క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించబడింది. ఇందుకు టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్‌లో జరిగిన తొలి వన్డేనే వేదికైంది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్(120) ముందుగా సెంచరీ చేయగా, టీమిండియా కెప్టెన్(112) శతకం సాధించాడు. ఫలితంగా ఒకే వన్డేలో శతకాలు చేసిన కెప్టెన్లుగా డుప్లెసిస్-కోహ్లిలు రికార్డులుకెక్కారు. ఓవరాల్‌గా చూస్తే ఒకే వన్డేలో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు చేయడం ఈ ఫార్మాట్ చరిత్రలో నాల్గోసారి మాత్రమే.
మ్యాచ్-1; 2013లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ కెప్టెన్ విలియమ్ పోర్టర్ ఫీల్డ్‌లు శతకాలు సాధించారు. తద్వారా తొలిసారి ఒకే వన్డేలో శతకాలు సాధించిన కెప్టెన్లుగా వీరిద్దరూ రికార్డు పుస్తకాల్లో కొత్త చరిత్ర లిఖించారు.
మ్యాచ్-2; 2014లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీమ్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లిలు శతకాలు సాధించారు. దాంతో ఏడాది వ్యవధిలోనే ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు మూడంకెల మార్కును చేరిన ఘనతను కోహ్లి-రహీమ్‌లు సొంతం చేసుకున్నారు.
మ్యాచ్-3; 2014లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి-శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ‍్యూస్‌లు సెంచరీలు నమోదు చేశారు. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ శతకాలు సాధించారు.
మ్యాచ్-4: తాజా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్-భారత కెప్టెన్ కోహ్లిలు శతకాలతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు సందర్బాల్లో మూడుసార్లు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి భాగస్వామ్యం కావడం ఇక్కడ మరో విశేషం.