ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేత జొకోవిచ్‌

Novak Djokovic To Win His The 7th Australian Open Title - Sakshi

ఏడో సారి ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచిన నొవాక్‌ జొకోవిచ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా ఏడో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్‌ దూకుడు ముందు నాదల్‌ తేలిపోయాడు. వరుసగా మూడు సెట్లను సునాయసంగా కైవసం చేసుకోవడంతో నాదల్‌కు ఓటమితప్పలేదు. దీంతో రాయ్‌ ఎమర్సన్‌, ఫెడరర్‌ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

జొకోవిచ్‌ చాంపియన్‌ ఆట
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ అసలైన చాంపియన్‌ ఆట ఆడాడు. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన నాదల్‌కు ఫైనల్‌ పోరులో చుక్కలు చూపించాడు. మ్యాచ్‌ ఆసాంతం ఎలాంటి అనవసర తప్పిదాలు చేయని సెర్బియా స్టార్‌.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇక ఈ విజయంతో జొకోవిచ్‌ పదిహేనో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సంప్రాస్‌(14) రికార్డును నొవాక్‌ అధిగమించాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో జొకోవిచ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో నాదల్‌ రెండో స్థానంలో ఉండగా 20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెడరర్‌ కొనసాగుతున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top