29 మాస్టర్స్ టైటిల్స్ తో రికార్డు!

29 మాస్టర్స్  టైటిల్స్ తో రికార్డు!


కెరీర్‌లో 29వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ వశం

* ఫైనల్లో ముర్రేపై విజయం

* రూ. 6 కోట్ల 93 లక్షల ప్రైజ్‌మనీ సొంతం


మాడ్రిడ్: ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఐదో టైటిల్‌ను సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ సెర్బియా స్టార్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-2, 3-6, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు.



ఈ విజయంతో జొకోవిచ్ అత్యధికంగా 29 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ టోర్నీకి ముందు జొకోవిచ్, నాదల్ 28 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 9,12,000 యూరోల (రూ. 6 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్‌కిది 64వ సింగిల్స్ టైటిల్. ఈ క్రమంలో అతను కెరీర్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో  బోర్గ్ (స్వీడన్), సంప్రాస్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. కానర్స్ (అమెరికా-109 టైటిల్స్), లెండిల్ (అమెరికా-94), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్-88 టైటిల్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

 

రెండో ర్యాంక్‌లోకి ఫెడరర్

మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైన ఆండీ ముర్రే రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. దాంతో ఆరు నెలల తర్వాత ఫెడరర్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ 16,550 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top