
మళ్లీ రొనాల్డోకే...
ప్రపంచకప్‌లో జట్టుకు నాకౌట్ అర్హత కల్పించలేకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న పోర్చుగల్ కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో...
జ్యూరిచ్: ప్రపంచకప్‌లో జట్టుకు నాకౌట్ అర్హత కల్పించలేకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న పోర్చుగల్ కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్టాత్మక ‘2014 బాలాన్ డియోర్’ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్ ఆధారంగా అతనికి ఈ అవార్డు దక్కింది. 181 దేశాల కోచ్‌లు, 182 దేశాల కెప్టెన్‌లు, 181 మంది జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2008, 2013ల్లోనూ ఈ అవార్డును నెగ్గిన రొనాల్డోకు ఈసారి 37.66 శాతం ఓట్లు పడ్డాయి.
గతంలో ఈ పురస్కారాన్ని వరుసగా మూడుసార్లు (2010, 11, 12) సాధించిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీకి 15.76 శాతం, విశ్వవిజేత జర్మనీ జట్టు గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయర్‌కు 15.72 శాతం ఓట్లు వచ్చాయి. 2010 నుంచి వార్షిక అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నిలిచిన వారికి ‘బాలాన్ డియోర్’ పురస్కారం అందజేస్తున్నారు. అంతకుముం దు దీనిని ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో పిలిచేవారు. అయితే ఈ రెండూ విలీనం కావడంతో 2010 నుంచి ఈ అవార్డును ‘బాలాన్ డియోర్’గా వ్యవహరిస్తున్నారు.
2014లో రొనాల్డో తమ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టుకు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ట్రోఫీని అందించాడు. ఇదే లీగ్‌లో ఒకే సీజన్‌లో అత్యధికంగా 17 గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇతర పురస్కారాల్లో ‘మహిళల అత్యుత్తమ క్రీడాకారిణి’గా జర్మనీకి చెందిన నాదైన్ కెస్లర్ నిలిచింది. ‘ఉత్తమ కోచ్’ అవార్డు జర్మనీ కోచ్ జోచిమ్ లూను వరించగా... ప్రపంచకప్‌లో ఉరుగ్వేపై జేమ్స్ రొడ్రిగ్వెజ్ (కొలంబియా) చేసిన గోల్‌కు ‘ఉత్తమ గోల్’ పురస్కారం దక్కింది.