Portugal captain
-
రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..
Cristiano Ronaldo: ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి నవజాత కుమారుడు మరణించాడు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు.. ‘‘మా చిన్నారి కుమారుడు మమ్మల్ని శాశ్వతంగా వదిలివెళ్లిపోయాడని చెప్పడానికి చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి వేదనను అనుభవిస్తారో మా పరిస్థితి అలాగే ఉంది. ఈ క్షణంలో మా చిన్నారి కూతురు జననమే మాకు కాస్త ఊరటనిస్తోంది. మా పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతూ వారిని కంటికి రెప్పలా కాచిన నర్సులు, డాక్టర్లకు ధన్యవాదాలు. ఇలాంటి కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలగకుండా వ్యవహరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా చిన్నారి బాబూ.. నువ్వు దేవదూతవి. నిన్ను మేము ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’ అని తన సహచరి జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి రొనాల్డో సంయుక్త ప్రకటన విడుదల చేశాడు. కాగా తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నామంటూ రొనాల్డో, జార్జినా గతేడాది అక్టోబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. కవలలు పుట్టబోతున్నారంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం వారికి కవల పిల్లలు(ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) జన్మించారు. వీరిలో నవజాత కుమారుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక రొనాల్డోకు ఇప్పటికే నలుగురు సంతానం. జార్జినాతో గతంలో ఓ కూతురు ఉండగా.. తాజాగా మరో కుమార్తె జన్మించింది. చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ -
మళ్లీ రొనాల్డోకే...
జ్యూరిచ్: ప్రపంచకప్‌లో జట్టుకు నాకౌట్ అర్హత కల్పించలేకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్న పోర్చుగల్ కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రతిష్టాత్మక ‘2014 బాలాన్ డియోర్’ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్ ఆధారంగా అతనికి ఈ అవార్డు దక్కింది. 181 దేశాల కోచ్‌లు, 182 దేశాల కెప్టెన్లు, 181 మంది జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2008, 2013ల్లోనూ ఈ అవార్డును నెగ్గిన రొనాల్డోకు ఈసారి 37.66 శాతం ఓట్లు పడ్డాయి. గతంలో ఈ పురస్కారాన్ని వరుసగా మూడుసార్లు (2010, 11, 12) సాధించిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీకి 15.76 శాతం, విశ్వవిజేత జర్మనీ జట్టు గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయర్కు 15.72 శాతం ఓట్లు వచ్చాయి. 2010 నుంచి వార్షిక అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నిలిచిన వారికి ‘బాలాన్ డియోర్’ పురస్కారం అందజేస్తున్నారు. అంతకుముం దు దీనిని ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో పిలిచేవారు. అయితే ఈ రెండూ విలీనం కావడంతో 2010 నుంచి ఈ అవార్డును ‘బాలాన్ డియోర్’గా వ్యవహరిస్తున్నారు. 2014లో రొనాల్డో తమ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టుకు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ట్రోఫీని అందించాడు. ఇదే లీగ్‌లో ఒకే సీజన్లో అత్యధికంగా 17 గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇతర పురస్కారాల్లో ‘మహిళల అత్యుత్తమ క్రీడాకారిణి’గా జర్మనీకి చెందిన నాదైన్ కెస్లర్ నిలిచింది. ‘ఉత్తమ కోచ్’ అవార్డు జర్మనీ కోచ్ జోచిమ్ లూను వరించగా... ప్రపంచకప్‌లో ఉరుగ్వేపై జేమ్స్ రొడ్రిగ్వెజ్ (కొలంబియా) చేసిన గోల్‌కు ‘ఉత్తమ గోల్’ పురస్కారం దక్కింది.