వొజ్నియాకి నిష్క్రమణ

No. 2 Caroline Wozniacki follows No. 1 Simona Halep on way out - Sakshi

  రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి సురెంకో చేతిలో పరాజయం  

ఫెడరర్, జొకోవిచ్‌ ముందంజ

 యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ 

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తొలి రౌండ్‌లోనే టాప్‌ సీడ్‌ హలెప్‌ ఇంటిముఖం పట్టగా... ఆమె సరసన రెండో సీడ్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), 11వ సీడ్‌ కసత్‌కినా (రష్యా) చేరారు. ఉక్రెయిన్‌ అమ్మాయి లెసియా సురెంకోతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి 4–6, 2–6తో... సస్నోవిచ్‌ (బెలారస్‌)తో జరిగిన మ్యాచ్‌లో కసత్‌కినా 2–6, 6–7 (3/7)తో ఓడిపోయారు. సురెంకతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి మూడు డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 35 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్‌ షరపోవా (రష్యా), నాలుగో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆరో సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 7–5, 6–4, 6–4తో పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–1, 6–3, 6–7 (2/7), 6–2తో సాండ్‌గ్రెన్‌ (అమెరికా)పై, నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–4, 6–2తో మహుట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు.  

పేస్‌ జంట పరాజయం 
పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పేస్‌ (భారత్‌)–సెరెటాని (అమెరికా) జంట 3–6, 4–6తో చార్డీ–మార్టిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో... జీవన్‌–ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌) ద్వయం 3–6, 2–6తో కబాల్‌–ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్‌ శరణ్‌–సితాక్‌ (న్యూజిలాండ్‌) జోడీ 6–4, 6–4తో రెడికి–జు (అమెరికా) జంటపై గెలిచింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top