సోదర ‘త్రయం’ కలిసి బరిలోకి... | Sakshi
Sakshi News home page

సోదర ‘త్రయం’ కలిసి బరిలోకి...

Published Tue, Jul 18 2017 2:07 AM

సోదర ‘త్రయం’ కలిసి బరిలోకి...

ఆమ్‌స్టల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): అంతర్జాతీయ క్రికెట్‌లో కవల సోదరులు (ట్విన్స్‌) కలిసి ఆడిన మ్యాచ్‌లు ఎన్నో చూశాం. కానీ ఒకే రోజు పుట్టిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్‌) ఒకే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగిన అరుదైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఇక్కడి వీఆర్‌ఏ మైదానంలో నెదర్లాండ్స్, యూఈఏ మధ్య జరిగిన తొలి వన్డే దీనికి వేదికగా నిలిచింది. నెదర్లాండ్స్‌ తరఫున 20 ఏళ్ల సికందర్‌ జుల్ఫిఖర్, అసద్‌ జుల్ఫిఖర్, సాఖిబ్‌ జుల్ఫికర్‌ ఈ మ్యాచ్‌లో ఆడారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ తరహా ఘనత మొదటిది కావడం విశేషం. వీరిలో సికందర్‌ ఇప్పటికే 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడగా...అసద్, సాఖిబ్‌లకు ఇదే తొలి మ్యాచ్‌. మార్చి 28, 1997న పుట్టిన ఈ ముగ్గురు పాకిస్తాన్‌ సంతతికి చెందినవారు. సియాల్‌కోట్‌కు చెందిన వీరి తండ్రి జుల్ఫిఖర్‌ అహ్మద్‌ చాలా ఏళ్ల క్రితమే నెదర్లాండ్స్‌లో స్థిర పడ్డారు. స్వయంగా క్రికెటర్‌ అయిన అహ్మద్, 9 లిస్ట్‌–ఎ మ్యాచ్‌లలో నెదర్లాండ్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగారు. అదే అనుభవంతో ఆయన తన ముగ్గురు పిల్లలను క్రికెట్‌లో ప్రోత్సహించారు. ఈ మ్యాచ్‌లో యూఏఈ 3 వికెట్ల తేడాతో గెలిచింది.

Advertisement
Advertisement