మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేనే మరిన్ని పతకాలు

Need improved facilities if we want medal at Olympics - Sakshi

ఆసియా క్రీడల వీడ్కోలు కార్యక్రమంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే... ఆ మెగా టోర్నీకి సరితూగే శిక్షణ సౌకర్యాలను రెజ్లర్లకు అందించాలని అంటోంది వినేశ్‌ ఫొగాట్‌. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడలు, స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో స్వర్ణాలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న 23 ఏళ్ల ఈ హరియాణా రెజ్లర్‌ జాతీయ శిబిరాల్లో క్రీడాకారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. రెజ్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలు అందడం లేదని వాపోయింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన స్పాన్సర్‌ టాటా మోటార్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆసియా క్రీడల వీడ్కోలు సమావేశం జరిగింది.

ఇందులో పాల్గొన్న వినేశ్‌ ఫొగాట్‌ గతంతో పోలిస్తే రెజ్లర్ల పరిస్థితి కాస్త మెరుగైందని తెలిపింది. ‘ఆసియా క్రీడల కోసం లక్నోలో నిర్వహిస్తోన్న జాతీయ శిబిరంలో తగిన సౌకర్యాలు లేవు. రెజ్లింగ్‌ హాల్‌లో బాగా ఉక్కపోతగా ఉంటోంది. కరెంట్‌ కూడా ఉండకపోవడంతో ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే ఇక్కడ ఆహారం నాణ్యత పెరిగింది. కానీ చాలా విషయాల్లో ఇంకా మార్పు రావాలి. కుస్తీలో ఒలింపిక్స్‌ పతకం ఆశిస్తారు. కానీ రెజ్లర్లకు అందించే సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. డబ్ల్యూఎఫ్‌ఐ రెజ్లర్లకు అండగా నిలుస్తున్నప్పటికీ మిగతా వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మెరుగైన ప్రదర్శనకు మెరుగైన శిక్షణ పరిస్థితులుండాలి’ అని ఆమె వివరించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top