దూసుకుపోతున్న రెజ్లర్ సుజీత్ కల్కాల్
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌గా ఆవిర్భావం
వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్‌లోనూ పసిడి పతకం
వరుస విజయాలతో అగ్రస్థానానికి
ఒలింపిక్ పతకమే అసలు లక్ష్యం
సాక్షి క్రీడా విభాగం : గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ (ఆసియా) జరుగుతోంది. భారత్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో గెలిచిన తర్వాత సుజీత్ కల్కాల్ ఇక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే అనూహ్య వరదలు దుబాయ్ నుంచి ముంచెత్తడంతో అక్కడి నుంచి విమానంలో అతను సరైన సమయానికి అమ్మాన్ చేరలేకపోయాడు. దాంతో సుజీత్ తీవ్రమైన పోటీ ఉండే వరల్డ్ క్వాలిఫయర్స్‌లో తలపడాల్సి వచ్చింది.
ఇస్తాంబుల్‌లో జరిగిన ఈ టోర్నీ లో ఈ ఈవెంట్ ఆరంభంలో సత్తా చాటిన సుజీత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. మరొక్క విజయం సాధిస్తే చాలు పారిస్ ఒలింపిక్స్ టికెట్ ఖాయమయ్యేది. కానీ తర్వాతి రెండు బౌట్‌లలో ఓటమిపాలై అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడు. రెండో బౌట్‌లోనైతే వరల్డ్ చాంపియన్ జైన్ రూథర్‌ఫోర్డ్‌తో హోరాహోరీగా తలపడి 2–2తో నిలిచాడు. అయితే చివరి పట్టు (క్రయిటీరియా) ప్రత్యరి్థది కావడంతో సుజీత్ ఓటమి నమోదైంది. అయితే సుజీత్ నిరాశ చెందలేదు.
ఆ పరాజయం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందని, పరాజయాన్నే స్ఫూర్తిగా తీసుకుంటానంటూ నాటి పరాజయం ఫొటోను అతను తన ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. ఎప్పుడు దానిని చూసినా ఇంకా సాధించాలనే ప్రేరణ తనకు దక్కుతుందని సుజీత్ చెబుతాడు. ‘నేను ఓడినా సరే ఈ రెండు మ్యాచ్‌లకు నా కెరీర్‌లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరాజయాలతో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని సుజీత్ తెలిపాడు.
సంపూర్ణ ఆధిపత్యం...
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎంత వేగంగా తాను పైకి లేవగలనో సుజీత్ ఇటీవలే నిరూపించాడు. గత నెలలో క్రొయేషియాలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సుజీత్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్లో 5–6తో ఇరాన్ రెజ్లర్ రెహమాన్ మూసా అమూజాద్‌ఖలీలి చేతిలో పోరాడి ఓడిపోయాడు. సుజీత్‌పై నెగ్గిన రెహమాన్ మూసా చివరకు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. రెహమాన్ ఫైనల్‌కు చేరుకోవడంతో సుజీత్‌కు ‘రెపిచాజ్’ రూపంలో కాంస్య పతకం సాధించే అవకాశం లభించింది.
అయితే ‘రెపిచాజ్’ తొలి రౌండ్‌లో సుజీత్ 5–7తో రియల్ మార్షల్ రే వుడ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి పతకానికి దూరమైపోయాడు. కానీ ఈ మెగా ఈవెంట్‌లో తాను చేసిన తప్పిదాలను సమీక్షించుకొని ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమయ్యాడు. సుజీత్ పకడ్బందీ సన్నాహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. సెర్బియాలోని నోవిసాద్‌లో సోమవారం ముగిసిన ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్‌లో సుజీత్ విశ్వవిజేతగా అవతరించాడు. తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ టైటిల్‌ను సాధించాడు.

స్వర్ణ పతకం సాధించే క్రమంలో సుజీత్... క్వార్టర్ ఫైనల్లో రెండుసార్లు అండర్–23 వరల్డ్ చాంపియన్ బషీర్ మగోమెదోవ్ (రష్యా)పై 4–2తో... సెమీఫైనల్లో ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ యుటో నిషియుచి (జపాన్)పై 3–2తో గెలుపొందాడు. నిషియుచితో జరిగిన బౌట్‌లో సుజీత్ చివరి సెకను వరకు ఓటమి అంగీకరించకూడదనే తత్వం విజయాన్ని అందించింది. బౌట్ ముగియడానికి 7 సెకన్లు మాత్రమే ఉన్నదశలో సుజీత్ 1–2తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు.
కానీ ఈ 7 సెకన్లలో సుజీత్ తన బలాన్నంతా కూడదీసుకున్నాడు. నిషియుచిని కింద పడేసి రెండు పాయింట్లు సాధించాడు. చివరకు 3–2తో నెగ్గిన సుజీత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. గత నెలలో జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్íÙప్‌లో కాంస్య పతకం నెగ్గిన ఉమిద్‌జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)తో సుజీత్ ఫైనల్ బౌట్‌కు సిద్ధమయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జలోలోవ్‌పై సుజీత్ నమ్మశక్యంకాని రీతిలో 10–0తో బ్రహ్మండ విజయాన్ని సాధించాడు. సుజీత్ డిఫెన్స్‌ను ఎలా ఛేదించాలో తెలుసుకునేలోపే జలోలోవ్ పది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకున్నాడు.
2 పాయింట్లే కోల్పోయి...
ఈ రెండు మెగా ఈవెంట్లకు ముందు సుజీత్ జులైలో బుడాపెస్ట్‌లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఇదేమీ సాధారణ విజయం కాదని అతను ఓడించిన ఆటగాళ్లను చూస్తే అర్థమవుతుంది. ఒలింపిక్ కాంస్యపతక విజేత ఇస్లామ్ దుదేవ్, రెండు సార్లు ఒలింపిక్స్ ఆడిన వాజ్‌గన్ తెవన్యమ్, నాలుగు సార్లు యూరోపియన్ మెడలిస్ట్ అలీ రహీమ్‌జాదేలపై సుజీత్ విజయం సాధించాడు.
ఈ టోర్నీలో నాలుగు బౌట్‌లలో కలిపి 33 పాయింట్లు సాధించిన అతను 2 పాయింట్లు మాత్రమే కోల్పోయి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో భవిష్యత్‌లో సుజీత్ అద్భుతాలు చేయగలడని అంచనాలు మరింత పెరిగాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది ఐదు టోర్నీల్లో పోటీపడ్డ సుజీత్ 3 పతకాలు సాధించాడు. 21 బౌట్‌లలో పోటీపడ్డ సుజీత్ 17లో గెలుపొంది, 4లో ఓడిపోయాడు. 169 పాయింట్లు స్కోరు చేసి, ప్రత్యర్థులకు 37 పాయింట్లు మాత్రమే సమర్పించుకున్నాడు.
భిన్నమైన శైలితో విజయాలు...
సాధారణంగా ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి ఆపై పైచేయి సాధించడం భారత రెజ్లర్ల శైలి. అంటే ఆరంభంలో వెనుకబడినా ఆ తర్వాత కోలుకొని పట్టు బిగిస్తారు. అయితే సుజీత్ శైలి దీనికి పూర్తిగా భిన్నం. సాధ్యమైనంత త్వరగా ఆటను ముగించడమే లక్ష్యంగా అతను బరిలోకి దిగుతాడు. సరిగ్గా చెప్పాలంటే టెక్నిక్‌పైనే అతను ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సుజీత్‌ను టెక్నికల్ రెజ్లర్‌గా అంతా పిలుస్తారు.
ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో ఓడిపోవడం ఒక రకంగా తనకు మేలు చేసిందని అతను అన్నాడు. అత్యున్నత స్థాయిలో ఆడేటప్పుడు లోపాలు ఎలా సరి చేసుకోవాలో తనకు అర్థమైందని, మ్యాట్ ట్రైనింగ్ తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సుజీత్ చెప్పాడు. ఈ ఏడాది ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం చేజారినా... తన అసలు లక్ష్యం మాత్రం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమేనని తెలిపాడు.
ఇంజినీరింగ్‌ను కాదని రెజ్లింగ్‌కు...
ప్రస్తుతం భారత పురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. నిజానికి అతను ఆటలో చాలా ఆలస్యంగా వచ్చాడు. గత ఐదేళ్ల నుంచే పూర్తి స్థాయిలో రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాడు. హరియాణాలోని భివాని సమీప గ్రామం ఇమ్లోటా అతని స్వస్థలం. అతని తండ్రి దయానంద్ రెజ్లింగ్‌లో మాజీ చాంపియన్ కావడంతోపాటు 2005 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే మొదటి నుంచీ సుజీత్ చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు.
ఇంటర్మీడియట్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించాడు. దాంతో తండ్రి కూడా చదువుపైనే దృష్టి పెట్టమని చెప్పాడు. కానీ ఈ కుర్రాడు నేను రెండూ చేయగలనంటూ అటు చదువు, ఇటు రెజ్లింగ్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. సహజంగానే రెండింటిపై దృష్టి పెట్టలేకపోయాడు. చదువులో మంచి మార్కులు రాగా ... రెజ్లింగ్ అండర్–17, అండర్–19 స్థాయిల్లోనూ ఎలాంటి ఫలితాలు రాలేదు.
‘నేను ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నాను. జేఈఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ మాక్ టెస్టులకు కూడా హాజరయ్యాను. అప్పుడు నాన్న స్పష్టంగా చెప్పారు. రెండూ సాధ్యం కాదని, ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని అన్నారు. చాలా ఆలోచించిన తర్వాత రెజ్లింగ్ వైపు మళ్లాను. నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం. సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా ఆట చూస్తూ పెరిగాను దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయంగా భావించా’ అని సుజీత్ చెప్పాడు. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం సోనీపథ్ చేరిన అతను కుల్దీప్ సింగ్ కోచింగ్‌లో రాటుదేలాడు.
2021లో ఇక్కడికి వచ్చిన సుజీత్ నాలుగేళ్లలో భారత అత్యుత్తమ రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 2022లో తొలిసారి సీనియర్ నేషనల్స్‌లో పాల్గొన్న అనంతరం అతను వేగంగా దూసుకుపోయాడు. గత ఏడాది అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల్లో పోటీపడి కాంస్య పతకాన్ని నెగ్గిన సుజీత్... ఆసియా అండర్–23 చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచాడు.


