విజేత లలిత్‌ బాబు

National Premiere Chess Championship winner lalith babu - Sakshi

జాతీయ ప్రీమియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌. లలిత్‌ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్‌ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 14 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్‌ బాబు పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) గ్రాండ్‌మాస్టర్‌ స్వప్నిల్‌ ధోపాడేతో జరిగిన చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌ను లలిత్‌ కేవలం 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు లలిత్‌ 44 ఎత్తుల్లో ఎస్‌. నితిన్‌ (ఆర్‌ఎస్‌పీబీ)పై; 29 ఎత్తుల్లో దేబాశిష్‌ దాస్‌ (ఒడిశా)పై; 57 ఎత్తుల్లో ఆర్‌.ఆర్‌. లక్ష్మణ్‌ (ఆర్‌ఎస్‌పీబీ)పై; 46 ఎత్తుల్లో అరవింద్‌ చిదంబరం (తమిళనాడు)పై; 54 ఎత్తుల్లో జయకుమార్‌ (మహారాష్ట్ర)పై; 39 ఎత్తుల్లో సునీల్‌దత్‌ నారాయణన్‌ (కేరళ)పై గెలిచాడు. శ్యామ్‌ నిఖిల్‌ (ఆర్‌ఎస్‌పీబీ)తో 26 ఎత్తుల్లో; హిమాంశు శర్మ (ఆర్‌ఎస్‌పీబీ)తో 57 ఎత్తుల్లో; ఆర్గ్యదీప్‌ దాస్‌ (ఆర్‌ఎస్‌పీబీ)తో 21 ఎత్తుల్లో; అభిజిత్‌ కుంతే (పీఎస్‌పీబీ)తో 28 ఎత్తుల్లో; దీపన్‌ చక్రవర్తి (ఆర్‌ఎస్‌పీబీ)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మురళి కార్తికేయన్‌ (తమిళనాడు) చేతిలో మాత్రం 31 ఎత్తుల్లో ఓడిపోయాడు. మరోవైపు 8.5 పాయింట్లతో అరవింద్‌ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్‌ మూడో స్థానాన్ని సంపాదించాడు.  

ఎన్నాళ్లకెన్నాళ్లకు...
జాతీయ ప్రీమియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌కు 62 ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్ర స్టేట్‌ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో 1955లో ఏలూరులో తొలిసారి ఈ చాంపియన్‌షిప్‌ జరిగింది. రామచంద్ర సాప్రే (మహారాష్ట్ర), డి. వెంకయ్య (ఆంధ్రప్రదేశ్‌) సంయుక్త విజేతలుగా నిలిచారు. 1955లో వెంకయ్య తర్వాత ఈ పోటీల్లో లలిత్‌ బాబు రూపంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌కు టైటిల్‌ దక్కడం విశేషం. మాన్యుయల్‌ ఆరోన్‌ (తమిళనాడు) అత్యధికంగా తొమ్మిదిసార్లు ఈ టైటిల్‌ను దక్కించుకోగా... ప్రవీణ్‌ థిప్పే (మహారాష్ట్ర) ఏడుసార్లు, సూర్యశేఖర గంగూలీ (బెంగాల్‌) ఆరుసార్లు, కృష్ణన్‌ శశికిరణ్‌ (తమిళనాడు) నాలుగుసార్లు, విశ్వనాథన్‌ ఆనంద్‌ (తమిళనాడు) మూడుసార్లు ఈ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు.   

తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా నా ప్రదర్శన ఆశించినస్థాయిలో లేదు. తాజా ఫలితం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం రెండు నెలలుగా కోచ్‌ మురళీకృష్ణతో కలిసి ప్రాక్టీస్‌ చేశాను. ఈ సన్నాహాలు టోర్నీ సందర్భంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ టోర్నీలో నేను తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లతో తలపడ్డాను. నలుగురిపై గెలిచి, మరో నలుగురితో గేమ్‌లు ‘డ్రా’ చేసుకున్నాను. వచ్చే సీజన్‌లోనూ మరింత నిలకడగా ఆడి మరిన్ని విజయాలు సాధించాలని పట్టుదలతో ఉన్నాను.     
– ‘సాక్షి’తో లలిత్‌ బాబు 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top