
కబడ్డీ విజేతలు నాంపల్లి, సికింద్రాబాద్
హెచ్‌డీఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్, నాంపల్లి మండల్ జట్లు ఆకట్టుకున్నాయి.
సాక్షి, హైదరాబాద్: హెచ్‌డీఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్, నాంపల్లి మండల్ జట్లు ఆకట్టుకున్నాయి. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో జరిగిన కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్‌లలో విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అండర్–14 బాలుర కబడ్డీ ఫైనల్లో సికింద్రాబాద్ 22–8తో హిమాయత్ నగర్‌పై, వాలీబాల్ ఈవెంట్‌లో సికింద్రాబాద్ 25–2, 25–15తో హిమాయత్ నగర్‌పైనే గెలుపొంది రెండు టైటిళ్లను సాధించింది. అండర్–17 బాలికల కబడ్డీ ఫైనల్లో నాంపల్లి మండల్ జట్టు 26–14తో సికింద్రాబాద్ జట్టుపై గెలుపొందగా, వాలీబాల్ ఈవెంట్‌లో నాంపల్లి 25–13, 25–16తో సికింద్రాబాద్‌ను ఓడించి విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల కబడ్డీ ఫైనల్లో ముషీరాబాద్ 2–0తో గోల్కొండపై గెలుపొందింది.
సెయింట్ ఫ్రాన్సిస్‌కు రెండు టైటిళ్లు
సాఫ్ట్‌బాల్ ఈవెంట్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ బాలికల జట్లు సత్తా చాటాయి. అండర్–14, 17 విభాగాల్లో చాంపియన్‌లుగా నిలిచాయి. అండర్–17 బాలికల ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 3–2తో ఆర్‌ఎంహెచ్‌ఎస్‌పై విజయం సాధించింది. అండర్–14 బాలికల టైటిల్ పోరులో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 5–4తో ఆర్‌ఎంహెచ్‌ఎస్‌ను ఓడించింది. మరోవైపు అండర్–17 బాలుర ఫైనల్లో ఆర్‌ఎం హెచ్‌ఎస్ 3–2తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై నెగ్గింది. అండర్–14 బాలుర ఫైనల్లో ఇంటర్నేషనల్ స్కూల్ 5–3తో ఆర్‌ఎంహెచ్‌ఎస్‌ను ఓడించి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది.