పోటీ చేసి గెలిచినా... | N Srinivasan can't assume position till matter is in court, rules SC | Sakshi
Sakshi News home page

పోటీ చేసి గెలిచినా...

Sep 28 2013 12:55 AM | Updated on Sep 2 2018 5:20 PM

పోటీ చేసి గెలిచినా... - Sakshi

పోటీ చేసి గెలిచినా...

బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈనెల 29న జరగాల్సిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది.

న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈనెల 29న జరగాల్సిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. అలాగే తమ ఆఫీస్ బేరర్ల ఎన్నికకు కూడా మార్గం సుగమం చేసింది. దీంతో మరోసారి అధ్యక్ష పదవిపై కన్నేసిన శ్రీనివాసన్‌కు అన్ని అడ్డంకులు తొలగినట్టే. అయితే ఇక్కడ సుప్రీం కోర్టు ఓ మెలిక పెట్టింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా మరో ఏడాదికి ఎన్నికైనప్పటికీ ఆయనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) వేసిన పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడేదాకా బాధ్యతలు తీసుకోవడానికి వీలుండదు.
 
  ‘ఆయన (శ్రీనివాసన్) అల్లుడి పేరు చార్జిషీట్‌లో ఉన్నప్పుడు ఇంకా ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా ఎందుకున్నారు? మరోసారి ఎన్నిక కావాలని అంత ఆతృత ఎందుకు? కేసు మొత్తం పూర్తయ్యేదాకా ఆయన బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు వీల్లేదు’ అని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ జేఎస్ శేఖర్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ సాగుతున్నందున ఆయన మామ శ్రీనివాసన్‌ను బోర్డు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని గత సోమవారం సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
 ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: శ్రీనివాసన్
 ఆదివారం జరిగే బోర్డు ఏజీఎంలో తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏజీఎంకు హాజరుకానీయకుండా నన్నెవరూ ఆపలేరు. నా కామెంట్స్ తీసుకునేముందు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో గమనించండి. అసలు ఎన్నికల్లో నేనెందుకు పోటీ చేయకూడదు? ఎన్నికయ్యాక బాధ్యతలు తీసుకోవద్దని చెప్పిన కోర్టు వ్యాఖ్యలపై నేను స్పందించను. ఈ విషయంలో మీరేమైనా రాసుకోండి. అయితే నిజాలే రాయండి’ అని మీడియాకు శ్రీనివాసన్ హితవు పలికారు.

 సందిగ్ధంలో బోర్డు
 శ్రీనివాసన్ పోటీపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీసీఐలో సందిగ్ధత నెలకొంది. సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. ఒకవేళ ఆదివారం నాటి ఏజీఎంలో శ్రీని తిరిగి ఎన్నికైనప్పటికీ వెంటనే బాధ్యతలు తీసుకునేందుకు వీలుండదు. ప్రస్తుతం రోజువారీ వ్యవహారాలను తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా పర్యవేక్షిస్తున్నప్పటికీ సంతకాలు చేసే అధికారం మాత్రం శ్రీనివాసన్‌కే ఉంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవడం కుదరదు. దీంతో బీసీసీఐకి ముఖ్య నాయకుడు అంటూ ఎవరూ ఉండరు. ఈనేపథ్యంలో సంతకాలు చేసే అధికారం కూడా దాల్మియాకు ఇవ్వడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.
 
 సంజయ్ పటేల్‌కు కొనసాగింపు
 చెన్నై: బీసీసీఐ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టేందుకు ఎన్నికల బరిలో నిలువనున్న ఎన్.శ్రీనివాసన్ తన టీమ్‌లో పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న సంజయ్ పటేల్‌ను పూర్తి స్థాయిలో నియమించే అవకాశం ఉంది. ‘సంజయ్ పటేల్ పనితీరుపై శ్రీనివాసన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు.
 
  క్లిష్ట సమయంలో ఆయ శ్రీనికి అండగా నిలవడమే కాకుండా బహిరంగంగా మద్దతు పలికారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే కోశాధికారిగా వ్యవహరిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి సవానీ పదవి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సవానీ స్థానంలో మరో వ్యక్తిని కోశాధికారిగా నియమించేందుకు శ్రీని మొగ్గు చూపుతున్నారు. ఈ పదవికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు, కేరళ సీఏ చీఫ్ టీసీ మాథ్యూ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement