‘పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాం’

MSK Prasad Says Keeping An Eye On Ishan Kishan And Sanju Samson - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా నిరాశపరుస్తున్న పంత్‌పై అన్ని వైపులా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్‌ను పక్కకు పెట్టి మరో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే వాదన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ తరుణంలో పంత్‌ వైఫల్యాలపై ప్రసాద్‌ స్పందించాడు. పంత్‌ ప్రతిభను పరిగణలోకి తీసుకుని అతడిపై ఓపిగ్గా వ్యవహరిస్తున్నామని తెలిపాడు. 

పంత్‌లో అపార ప్రతిభ దాగుందని.. కానీ అతడి పేలవ, నిర్లక్ష్య షాట్ల ఎంపికపైనే తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నాడు. అయితే టీమిండియా వికెట్‌ కీపర్‌గా తమ తొలి ఛాయిస్‌ పంతేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా మూడు ఫార్మట్లలో కీపర్‌గా వ్యవహరిస్తున్న పంత్‌పై వర్క్‌లోడ్‌ తగ్గించే అంశం కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో యువ వికెట్‌ కీపర్లు సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషాన్‌ల దృష్టి సారించామని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు. 

ముఖ్యంగా లాంగ్‌ ఫార్మట్‌ క్రికెట్‌లో పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నామని ప్రసాద్‌ తెలిపాడు. రంజీల్లో విశేషంగా రాణిస్తున్న యువ వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా-ఏ జరిగిన టెస్టు మ్యాచ్‌లో కేఎస్‌ భరత్‌ ఆకట్టుకున్నాడని.. వన్డే సిరీస్‌లో శాంసన్‌ రాణించాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పకనే చెప్పాడు. ఇక వెస్టిండీస్‌ టూర్‌లో అంతగా ఆకట్టుకోని పంత్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోనూ పేలవ షాట్‌తో అవుటై అందరినీ నిరుత్సాహానికి గురిచేసిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top