ధోని చతురతపై షోయబ్‌ ప్రశంసలు..!

MS Dhoni Faster Than Computer Shoaib Akhtar Praise - Sakshi

కంప్యూటర్‌కన్నా వేగంగా స్పందిస్తాడని ‍ప్రశంస

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో సహచర ఆటగాళ్లకు నిర్దేశం చేస్తూ.. జట్టు విజయానికి ప్రణాళికలు రచించే ధోని మైదానంలో ఉండటం టీమిండియాకు కొండంత బలం అని చెప్పుకొచ్చాడు. మైదానంలో ధోని చతురత కంప్యూటర్‌ కంటే వేగంగా ఉంటుందని కితాబిచ్చాడు. ఏ వికెట్‌ ఎలా మారుతుందోననే విషయంలో ధోని కంప్యూటర్‌కన్నా వేగంగా స్పందిస్తాడని అన్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌లో పాక్‌ స్పీడ్‌స్టర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌లో నాలుగో ఆటగాడిగా పేర్కొంటున్న కేఎల్‌ రాహుల్‌ను కూడా షోయబ్‌ మెచ్చుకున్నాడు. ‘ఒక క్రికెటర్‌గా కేఎల్‌ రాహుల్‌ అంటే ఇష్టం. అతను కోహ్లి అడుగు జాడల్లో నడుస్తున్నాడనిపిస్తోంది. భవిష్యత్‌లో అతనో గొప్ప బ్యాట్స్‌మన్‌ అవుతాడు. గతంలో ఓసారి కలిసినప్పుడు..  మైదానంలో వెలుపల ఇతర వ్యాపకాల పై దృష్టి పెట్టకుండా.. ఆటపైనే ఫోకస్‌ పెట్టాలని సూచించాను. రాహుల్‌కు మంచి భవిష్యత్‌ ఉంది’అన్నాడు.

ఇక ఐసీసీ వరల్డ్‌కప్‌-2019లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలిమ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు... మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (4/51) మాయాజాలం, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/35) పకడ్బందీ బౌలింగ్‌తో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 228 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో ఛేదించిన భారత జట్టు ఘనంగా శుభారంభం చేసింది. హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (144 బంతుల్లో 122 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు ఎంస్‌ ధోని 34, కేఎల్‌ రాహుల్‌ 26 పరుగులు చేసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. చహల్‌ బౌలింగ్‌లో ధోని ఫెలుక్వాయోను స్టంపౌట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top