టీమిండియాకు ఎదురుదెబ్బ | Mithali Raj Duck out against south africa in 3rd T20 | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

Feb 18 2018 1:32 PM | Updated on Feb 18 2018 2:32 PM

Mithali Raj Duck out against south africa in 3rd T20 - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మూడో టీ20లో డకౌటైంది. గత రెండు టీ20 మ్యాచ్‌లలో అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చిన మిథాలీ నేటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టింది. తొలి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ ఇన్నింగ్స్ ఐదో బంతికి షాట్ ఆడగా ఫీల్డర్ లీ క్యాచ్ పట్టడంతో మిథాలీ నిరాశగా వెనుదిరిగింది.

అంతకుముందు భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడో టీ20లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మరోవైపు ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేన నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది.

రెండు జట్లలో చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత జట్టులో రాధా యాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి వచ్చింది. కాగా, ప్రొటీస్ జట్టులో ఖాకా స్థానంలో క్లాస్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు సఫారీ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. వాండరర్స్‌ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్‌ మొదలవనుండటం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement