విజయీభవ!

Mens Hockey World Cup: India to take on South Africa - Sakshi

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ‘ఢీ’

భారీ విజయంపై టీమిండియా దృష్టి

రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

భువనేశ్వర్‌: నాలుగున్నర దశాబ్దాల టైటిల్‌ నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ప్రపంచకప్‌ బరిలోకి దిగుతున్న భారత హాకీ జట్టు భారీ విజయంతో బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచ 15వ ర్యాంకర్‌ దక్షిణాఫ్రికాతో నేడు జరిగే పూల్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌తో టీమిండియా తమ టైటిల్‌ వేటను మొదలుపెట్టనుంది. రెండేళ్ల క్రితం స్వదేశంలో కోచ్‌ హరేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ వరల్డ్‌ కప్‌ నెగ్గిన భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుత సీనియర్‌ జట్టులో ఉన్నారు. రూపిందర్‌ పాల్‌ సింగ్, సునీల్‌లాంటి పలువురు సీనియర్‌ ఆటగాళ్లను కాదని జూనియర్‌ ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని కోచ్‌ హరేంద్ర సింగ్‌ సమర్థించుకున్నారు. ‘18 ఏళ్లు దాటిన వారికి వివాహం చేసుకున్నే హక్కు మన రాజ్యాంగం కల్పిస్తోంది. అలా అనుకుంటే ప్రస్తుత భారత జట్టు జూనియర్‌ జట్టేంకాదు. ఇది చరిత్ర సృష్టించబోయే బృందం. మంచి ఫలితాలు రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. ఎలాంటి అనవసర ప్రయోగాలకు పోకుండా ముందుగా రచించిన వ్యూహాలను మైదానంలో అమలు చేయాలని, సహజశైలిలో ఆడాలని మా ఆటగాళ్లకు సలహా ఇస్తున్నాను’ అని ఆయన తెలిపారు. పూల్‌ ‘టాపర్‌’గా నిలవాలని... నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలన్నదే తమ తొలి లక్ష్యమని ఆయన వివరించారు. చివరి నిమిషాల్లో గోల్స్‌ సమర్పించుకునే అలవాటు భారత్‌కే కాకుండా ఇతర జట్లకూ ఉందని హరేంద్ర సింగ్‌ అన్నారు. 

ఇక ‘డ్రాగ్‌ ఫ్లికర్‌’ హర్మన్‌ప్రీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్‌లతో భారత ఫార్వర్డ్‌ శ్రేణి పటిష్టంగా కనిపిస్తోంది. డిఫెన్స్‌లో మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లాక్రా... వెటరన్‌ స్టార్‌ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ మెరిస్తే భారత జట్టుకు తొలి మ్యాచ్‌లో విజయం లాంఛనమే అనుకోవాలి. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ప్రపంచకప్‌ సన్నాహాల కోసం తమ సొంత జేబుల నుంచి ఖర్చు చేసిన దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్‌ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌పై దక్షిణాఫ్రికా నమోదు చేసిన ఏకైక విజయం 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రావడం గమనార్హం. మంగళవారమే జరిగే పూల్‌ ‘సి’లోని మరో మ్యాచ్‌లో బెల్జియంతో కెనడా తలపడుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top