మేరీకోమ్‌ మెరిసె... | Mary Kom strikes gold at Asian Women's Boxing Championships | Sakshi
Sakshi News home page

మేరీకోమ్‌ మెరిసె...

Nov 9 2017 12:43 AM | Updated on Nov 9 2017 12:43 AM

Mary Kom strikes gold at Asian Women's Boxing Championships - Sakshi

హో చి మిన్‌ సిటీ (వియత్నాం): మూడు పదుల వయసు దాటినా తన పంచ్‌లో పదును తగ్గలేదని భారత మహిళా మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ నిరూపించింది. మూడేళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయస్థాయిలో ‘పసిడి’ పంచ్‌ను సంధించింది. బుధవారం ముగిసిన ఆసియా సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల మేరీకోమ్‌ చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5–0తో కిమ్‌ హ్యాంగ్‌ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్‌ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్‌ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి.  

2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్‌ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే కావడం విశేషం. ఈనెల 25న 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్న మేరీకోమ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన ఐదో స్వర్ణమిది. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది.  

టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్‌కు ఫైనల్లోనూ అంతగా ఇబ్బంది ఎదురుకాలేదు. 15 ఏళ్లుగా అంతర్జాతీయ బాక్సింగ్‌లో కొనసాగుతోన్న ఆమె తన అనుభవాన్నంతా రంగరించి ప్రత్యర్థి ఆట కట్టించింది. తొలి రౌండ్‌ నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అయితే కచ్చితమైన పంచ్‌లు సంధించిన మేరీకోమ్‌ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు చేరాయి. ఎడమ వైపు నుంచి ఉత్తర కొరియా బాక్సర్‌ మేరీకోమ్‌పై దాడులు చేసినా ఈ మణిపూర్‌ బాక్సర్‌ సమర్థంగా అడ్డుకుంటూనే ఎదురుదాడి చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement