ఈ రోజు కుంబ్లేకు వెరీ వెరీ స్పెషల్‌

A look back at Anil Kumbles historic 10 wicket haul vs Pakistan - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాళ్లలో అనిల్‌ కుంబ్లే ఒకడు. ప్రధానంగా తన లెగ్‌ బ్రేక్‌తో ప్రత్యర్థులు గుండెల్లో పరుగులు పెట్టించిన కుంబ్లే.. భారత్‌ జట్టుకు ఎనలేని సేవలందించాడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజు(ఫిబ్రవరి7వ తేదీ) కుంబ్లేకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. తన సంచలన ప్రదర్శనతో ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్న రోజు. అది కూడా దాయాది పాకిస్తాన్‌పై కావడం కుంబ్లేకు వెరీ వెరీ స్పెషల్‌గా చెప్పవచ్చు. రెండు దశాబ‍్దాల నాటి ఆ మ్యాచ్‌ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.

1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ జట్టు రెండు టెస్టుల్లో తలపడింది. ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో ప్రారంభమై ఆ టెస్టులో భారత్‌ గెలిస్తేనే సిరీస్‌ను కాపాడుకుంటుంది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. ఆ తరుణంలో తొలి వికెట్‌గా షాహిద్‌ ఆఫ్రిదిని ఔట్‌ చేసిన తన వేటను ఆరంభించాడు కుంబ్లే.  వరుసగా వికెట్లు సాధిస్తూ 207 పరుగులకే పాక్‌ను కుప్పకూల్చాడు. భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. దాంతొ ఒ‍క ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు సాధించి ఆ ఘనత నమోదు చేసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కుంబ్లే  కంటే ముందు ఒక ఇన్నింగ్స్‌లో పదికి పదికి వికెట్లు సాధించిన వారిలో జిమ్‌ లేకర్‌(ఇంగ్లండ్‌) తొలి స్థానంలో ఉన్నాడు. 1956లో జిమ్‌ లేకర్‌ ఈ మార్కును చేరగా, 43 ఏళ్ల తర్వాత దాన్ని అందుకున్న తొలి బౌలర్‌ కుంబ్లేనే కావడం విశేషం. దీనిపై స‍్పందించిన కుంబ్లే.. ఆ రోజు తాను తీసిన ప్రతీ వికెట్‌ తనకు మదిలో ఇప్పటికీ కదలాడుతూనే ఉందన్నాడు. తన కెరీర్‌లో ఒక మధురమైన జ్ఞాపకంగా ఆ మ్యాచ్‌ నిలుస్తుందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top