ఎకిల్‌స్టోన్‌ ఓ అజ్ఞాని: హామిల్టన్‌

Lewis Hamilton Slams Over Bernie Ecclestone Comments - Sakshi

పారిస్‌: ‘తెల్లవారికంటే నల్లవారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు’ అంటూ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) మాజీ చీఫ్‌ బెర్నీ ఎకిల్‌స్టోన్‌ చేసిన వ్యాఖ్యలపై వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ మండి పడ్డాడు. అతను ఒక అజ్ఞాని అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇటీవలి జాతి వివక్ష నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఎకిల్‌స్టోన్‌... ‘ఈ వివాదం ప్రభావం ఫార్ములావన్‌పై ఏ రకంగానూ ఉండదు. అయితే అందరూ ఆలోచించే తీరు మాత్రం మారుతుంది. తెల్లవారైనా, నల్లవారైనా అవతలి వారి గురించి తప్పుగానే ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే నల్లజాతివారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు. దీనికి నేను రుజువులు చూపించలేనుగానీ ఇన్నేళ్లుగా నాకు అలాగే అనిపించింది’ అన్నాడు.

89 ఏళ్ల ఎకిల్‌స్టోన్‌ వ్యాఖ్యలు హామిల్టన్‌కు ఆగ్రహం తెప్పించాయి. దాంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. ‘బెర్నీ ఆటకు దూరమై చాలా కాలమైంది. అతను పాత తరానికి చెందినవాడు. అయితే ఏమీ తెలియని ఇలాంటి అజ్ఞానులు చేసే వ్యాఖ్యలు చూస్తుంటేనే జాతి వివక్ష విషయంలో అంతరాలు తొలగించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. సుదీర్ఘ కాలం ఒక క్రీడకు పరిపాలకుడిగా వ్యవహరించిన వ్యక్తికి దిగువ స్థాయిలో తీవ్రంగా ఉన్న సమస్య గురించి ఇలాంటి అవగాహన ఉంటే అతని వద్ద ఇన్నేళ్లుగా పని చేసినవారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఎఫ్‌1 మేనేజ్‌మెంట్‌ మాత్రం ఎకిల్‌స్టోన్‌ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన ఏ హోదాలో లేరని స్పష్టం చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top