ఈ కర్కశంపై మాట్లాడరేంటి?

Lewis Hamilton slams F1 stars for staying silent on Floyd death - Sakshi

జాత్యహంకార హత్యపై గళం విప్పిన ఎఫ్‌1 వరల్డ్‌ చాంపియన్‌ హామిల్టన్‌

చార్లొట్‌ (అమెరికా): అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్‌ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ గళం విప్పాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ నల్లజాతి రేసర్‌ అయిన హామిల్టన్‌ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్‌ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్‌ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్‌ మీడియా వేదికపై నినదించారు.  

బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్‌
ఆఫ్రికన్‌–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్‌బీఏ సూపర్‌స్టార్‌ జోర్డాన్‌ అన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top