ఆసీస్‌ గడ్డపై కృనాల్‌ రికార్డ్‌

Krunal Pandya Sets T20Is Record For A Spinner In Australia - Sakshi

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో కోహ్లి సేన సిరీస్‌ను సమం చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ టీ-20ల్లో ఆరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా ఆసీస్‌ గడ్డపై రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో ఒకటి గొప్ప రికార్డు కాగా.. మరొకటి చెత్త రికార్డు.

బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ-20లో కృనాల్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకొని విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కృనాల్ అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచి లెక్క సరిచేశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ఈ యువ ఆల్‌రౌండర్‌ 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌ గడ్డపై టీ-20ల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు. తనపై వచ్చిన విమర్శలను వికెట్లతోనే సమాధానం చెప్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. ఈ ఏడాది హోబార్ట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాక్స్‌వెల్ మూడు వికెట్లు తీసి 10 పరుగులు ఇచ్చాడు. నిన్నటి వరకూ ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా.. ఇప్పుడు కృనాల్‌ పాండ్యా ఈ రికార్డును అధిగమించాడు. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌ డిసెంబర్ 6 నుంచి ప్రారంభంకానుంది.

చదవండి: భారత్‌దే విజయం.. సిరీస్‌ సమం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top