భారత మేటి డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫ్లోరిడాలో జరిగిన క్వాలిఫయింగ్ మీట్‌లో...
న్యూఢిల్లీ: భారత మేటి డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫ్లోరిడాలో జరిగిన క్వాలిఫయింగ్ మీట్‌లో ఆమె డిస్క్‌ను 57.10 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచింది. అయితే ఒలింపిక్స్ అర్హత ప్రమాణమైన 61 మీటర్లను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తుది గడువు సోమవారం కావడంతో ఇక ఈ మెగా ఈవెంట్‌లో పూనియా పాల్గొనే అవకాశాలు లేనట్లే. కేంద్ర క్రీడాశాఖ ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కింద గత రెండు నెలలుగా పూనియా అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.
2004, 2008, 2012 ఒలింపిక్స్‌లో పాల్గొన్న పూనియా ఫైనల్ రౌండ్ వరకు వచ్చినా పతకం గెలవలేదు. లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ‘రియోకు అర్హత సాధించేందుకు చాలా కృషి చేశా. కానీ సాధ్యం కాలేకపోయింది. నా శిక్షణకు సహకరించిన క్రీడాశాఖ, సాయ్‌లకు కృతజ్ఞతలు. రియోలో పాల్గొనే నా సహచరులు విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అని పూనియా పేర్కొంది.