ఈసారి శ్రీకాంత్‌దే పైచేయి | Kidambi Srikanth proves that his Indonesia Open win over Son Wan Ho was no fluke | Sakshi
Sakshi News home page

ఈసారి శ్రీకాంత్‌దే పైచేయి

Jun 24 2017 12:38 AM | Updated on Sep 5 2017 2:18 PM

ఈసారి శ్రీకాంత్‌దే పైచేయి

ఈసారి శ్రీకాంత్‌దే పైచేయి

తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ వరుసగా మూడో సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

సాయిప్రణీత్‌పై విజయంతో సెమీస్‌లోకి
► సింధు, సైనా నిష్క్రమణ
► ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ


సిడ్నీ: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ వరుసగా మూడో సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో భాగంగా... భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్‌తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 25–23, 21–17తో విజయం సాధించాడు.

సాయిప్రణీత్‌తో ఇప్పటివరకు ఏడుసార్లు ఆడిన శ్రీకాంత్‌కిది కేవలం రెండో విజయం కావడం గమనార్హం. అంతేకాకుండా సాయిప్రణీత్‌ను వరుసగా రెండు గేముల్లో ఓడించడం శ్రీకాంత్‌కిదే తొలిసారి. గత ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ చేతిలో ఓడిన శ్రీకాంత్‌ తాజా విజయంతో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ షి యుకి (చైనా)తో శ్రీకాంత్‌ ఆడతాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 2014లో ఇండియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఏౖకైకసారి సాయిప్రణీత్‌ను ఓడించిన శ్రీకాంత్‌కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. అయితే ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)ను వరుసగా రెండు టోర్నీల్లో ఓడించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్‌ అదే జోరులో సాయిప్రణీత్‌ అడ్డంకిని దాటాడు. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడినా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–16తో ఆధిక్యంలోకి వచ్చాడు.

ఆ తర్వాత ఇద్దరూ ప్రతీ పాయింట్‌ కోసం పోరాడారు. అయితే కీలకదశలో సాయిప్రణీత్‌ తప్పిదాలు చేసి తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగింది. అయితే విరామ సమయానికి 11–9తో ముందంజ వేసిన శ్రీకాంత్‌ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

నేటి సెమీఫైనల్స్‌ ఉదయం గం. 8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement