సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. కోచ్‌ మృతి

James Neesham Childhood Coach Died During Super Over - Sakshi

ఆక్లాండ్‌: వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ అత్యంత కీలక ఇన్నింగ్స్‌  ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్‌, ఆక్లాండ్‌ గ్రామర్‌ స్కూల్‌ మాజీ టీచర్‌ డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌ మరణించాడు. మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చే సూపర్‌ ఓవర్‌లో రెండో బంతిని నీషమ్‌ సిక్సర్‌ కొట్టిన సమయంలోనే జేమ్స్‌ గొర్డాన్‌ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్‌ తుదిశ్వాస విడిచారని సూపర్‌ ఓవర్‌ జరుగుతుండగా నర్స్‌ వచ్చి మాతో చెప్పారు. నీషమ్‌ సిక్సర్‌ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు.

గొర్డాన్‌ మృతికి నీషమ్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌.. నా హైస్కూల్‌ టీచర్‌, కోచ్‌, స్నేహితుడు. క్రికెట్‌ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’  అంటూ నీషమ్‌ ట్వీట్‌ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్‌ గ్రామర్‌ స్కూల్‌లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్‌ జేమ్స్‌ గొర్డాన్‌ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్‌, హాకీ నేర్పించారు. నీషమ్‌, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్‌ విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top