ఈ సారి ముంబై ఇండియన్స్‌ తరుపున..

IPL 2020: Trent Boult To Represent Mumbai Indians - Sakshi

ముంబై : న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక మరోవైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు అంకిత్‌ రాజ్‌పుత్‌ ఆటగాళ్ల మార్పులో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్‌-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్‌ విండో గడువు రేపటికి(నవంబర్‌ 14)ముగుస్తుండటంతో ఆటగాళ్ల మార్పులు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడింగ్‌ ముగిసిన అనంతరం ఐపీఎల్‌ వేలం డిసెంబర్‌19న కోల్‌కతాలో జరగనుంది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఇప్పటివరకు మూడు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్‌ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్‌ తరుపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్‌.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే వచ్చే సీజన్‌ కోసం సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్‌ బౌల్ట్‌ జతకట్టాడు. ఇక అంకిత్‌ రాజ్‌పుత్‌ కూడా కింగ్స్‌ పంజాబ్‌ తరుపున ఆడి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కాగా, ఇటీవలే ట్రెడింగ్‌ విండో విధానంతో కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన విషయం తెలిసిందే.  ఇక ట్రేడింగ్‌ విండో విధానం ఐపీఎల్‌-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top