
అలవాటైన రీతిలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తు కొట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్! మొదట్లో డక్కామొక్కీలు తిన్నా క్రమంగా పుంజుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో పాటు నాకౌట్ చేరింది ముంబై ఇండియన్స్! రెండింటి మధ్య నేడు తొలి ప్లే ఆఫ్. ఓడినా, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్న నేపథ్యంలో... సొంతగడ్డ అనుకూలతతో చెన్నై చెలరేగుతుందా? ఆలస్యంగానైనా అదరగొడుతోన్న ముంబై ఇంకో మాటకు తావు లేకుండా తుది సమరానికి చేరుతుందా? సమష్టి ప్రదర్శన కనబర్చే ధోని బృందానిది పై చేయి అవుతుందో? హిట్టర్లతో కూడిన రోహిత్ సేనది పైచేయి అవుతుందో చూద్దాం...?
చెన్నై: ఐపీఎల్–12 రెండో దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇంటాబయట రెండుసార్లు ముంబైకి తలవంచిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై... సొంత గడ్డపై, అది కూడా ప్లే ఆఫ్ దశలో అంత తేలిగ్గా వదిలేసేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు ముంబై... రెండు సార్లు పైచేయి సాధించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగబోతోంది. కీలకమైన ఆటగాళ్లంతా అందుబాటులో ఉండి, అన్నిరంగాల్లోనూ పటిష్టంగా ఉన్నందున మ్యాచ్ హోరాహోరీగా సాగి అభిమానులను అలరించే అవకాశం ఉంది.
అదే పెద్ద బలం...
సమష్టిగా ఆడటంలో చెన్నైని మించిన జట్టు ఏదీ లేదు. పైగా వేలాది మంది వీరాభిమానుల ప్రోత్సాహం మధ్య సొంతగడ్డపై ధోని బృందాన్ని ఆపడం కష్టం. సూపర్ కింగ్స్ ఆత్మవిశ్వాసానికి వీరే ఇంధనం. ఈ అంచనాలకు తగ్గట్లే సీఎస్‌కే రాణిస్తూ ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్‌లకు గాను ఆరింటిలో చెన్నైనే నెగ్గింది. ఓడిన ఒక్కటీ ముంబై చేతిలోనే కావడం గమనార్హం. అయితే, ఈ మ్యాచ్‌లో కీలకమైన ధోని, జడేజా, డుప్లెసిస్ లేకుండానే ఆ జట్టు ఆడింది. ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే వాట్సన్, డుప్లెసిస్, రైనా, ధోనిలతో కూడిన చెన్నై బ్యాటింగ్... మలింగ, బుమ్రా, పాండ్యా సోదరులతో బలంగా ఉన్న ముంబై బౌలింగ్ మధ్య పోరుగా పేర్కొనవచ్చు. ఫామ్‌లో లేకున్నా కీలక సమయంలో కేదార్ జాదవ్ దూరమవడం సీఎస్‌కేకు ఇబ్బందికరమే. అతడి స్థానంలో మురళీ విజయ్ లేదా ధ్రువ్ షోరెలలో ఒకరిని ఆడించవచ్చు. సమష్టి ప్రదర్శనకు తోడు బ్రేవో, జడేజా రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నై బలం. ఓపెనర్లలో డుప్లెసిస్ రాణిస్తున్నా, వాట్సన్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. గత 8 మ్యాచ్‌ల్లో అతడు రెండుసార్లే రెండంకెల స్కోర్లు చేయగలిగాడు. వన్‌డౌన్‌లో వస్తున్న సురేశ్ రైనా ఫామ్‌లో ఉన్నాడు. పరిస్థితిని బట్టి నాలుగో స్థానంలో రాయుడికి అవకాశం దక్కొచ్చు. చివర్లో స్కోరు పెంచేందుకు కెప్టెన్ ధోని, బ్రేవో ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో చెన్నై స్పిన్ త్రయం హర్భజన్–తాహిర్–జడేజాలను ఎదుర్కొనడం ప్రత్యర్థికి సవాలే. పొదుపుగా వేస్తూనే తాహిర్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. ఏకైక పేసర్ దీపక్ చహర్ అంచనాలను నిలబెట్టుకుంటున్నాడు. రెండో పేసర్‌గా ఆల్‌రౌండర్ బ్రేవోను వాడుకుంటూనే... ఇక్కడి వరకు వచ్చిందంటేనే జట్టు ఏ స్థాయిలో బలంగా ఉందో, ధోని వ్యూహాలు ఎలాంటివో తెలిసిపోతోంది. వీటిని ముంబై ఏమేరకు తట్టుకుంటుందో చూడాలి.
ముంబై ఆత్మవిశ్వాసంతో
సీజన్‌ను నిదానంగా ఆరంభించి కీలక సమయంలో జూలు విదిల్చడం ముంబై శైలి. ఈసారీ ఆ జట్టు ప్రయాణం అలాగే సాగింది. ఓ దశలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుందా? లేదా? అనే అనుమానం వచ్చినా చివరకు చూస్తే పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. గత ఆరు మ్యాచ్‌ల్లో ముంబై రెండింట్లో మాత్రమే ఓడింది. వీటిలో ఒకదాంట్లో (కోల్‌కతాపై) గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. విజయం సాధించిన 4 మ్యాచ్‌ల్లో మూడు ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ, చైన్నై, హైదరాబాద్‌పై కావడం విశేషం. టాపార్డర్‌లో ఓపెనర్లు డికాక్, కెప్టెన్ రోహిత్ జోరుమీదున్నారు. ఆదివారం నాటి మ్యాచ్‌లో రోహిత్ ఇన్నింగ్స్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. విధ్వంసక ఎవిన్ లూయీస్ తన స్థాయి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అన్నింటికంటే హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ నైపుణ్యం ముంబైని గట్టెక్కిస్తోంది. బ్యాట్‌తో విఫలమైతే బంతితో ప్రభావం చూపుతున్నాడు. పొలార్డ్ సహా మిగతావారు అనుకున్నంత రాణించకపోయినా ఈ సీజన్‌లో జట్టును ఆదుకున్నది హార్దికే. స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా పదేసి వికెట్లు తీసి తమ పాత్ర సమర్థంగా పోషిస్తున్నారు. పేస్ పరంగా చూస్తే బుమ్రా, మలింగలతో ముంబై భీకరంగా ఉంది. డెత్ ఓవర్లలో వీరిని కాచుకోవడం కష్టమే.
వీరే కీలకం ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ: ఈ సీజన్‌లో 386 పరుగులు చేశాడు. ఒత్తిడిని తట్టుకుంటూ కీలక మ్యాచ్‌ల్లో రాణిస్తున్నాడు.
డికాక్: ఐపీఎల్–12 అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో (492 పరుగులు) ఉన్నాడు. దూకుడుగా ఆడే డికాక్ మంచి ఆరంభాలనిస్తున్నాడు.
హార్దిక్ పాండ్యా: 380 పరుగులు, 14 వికెట్లతో ఆల్‌రౌండర్ హోదాకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. లక్ష్యం ఎంత భారీగా ఉన్నా వెరవకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌లోనూ ఆత్మ విశ్వాసంతో బంతులేస్తున్నాడు.
బుమ్రా, మలింగ: ఈ సీజన్‌లో 17 వికెట్లతో బుమ్రా, 15 వికెట్లతో మలింగ ముంబైకి వెన్నుముకగా నిలిచారు. ఈ పేస్ ద్వయం చివరి ఓవర్లలో మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్
ధోని: 12 మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాల సాయంతో 368 పరుగులు చేశాడు. ఆఖర్లో భీకర హిట్టింగ్‌కు దిగే పాత ధోనిని చూసే అవకాశం... చాలా కాలం తర్వాత ఈ సీజన్‌లో ప్రేక్షకులకు దక్కింది. పరిమిత వనరులనే అవసరానికి తగినట్లుగా వాడుకుంటూ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు.
డుప్లెసిస్: ఓపెనర్‌గా వస్తూ మంచి స్కోర్లు చేస్తున్నాడు. ఆదివారం పంజాబ్‌పై ఆడిన ఇన్నింగ్స్ డుప్లెసిస్ ఫామ్‌ను చాటుతోంది.
రైనా: జట్టు మొత్తంలో కీలక బ్యాట్స్‌మన్. వన్ డౌన్‌లో దిగుతూ స్కోరు చేసే బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నాడు.
బ్రేవో: బ్యాట్, బంతితో ఈ సీజన్‌లో స్థాయికి ఊహించిన మేర మెరుపులు కనబర్చలేదు. అయినా, విధ్వంసక బ్యాటింగ్, జిత్తులమారి బౌలింగ్ కారణంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
తాహిర్: ప్రస్తుత లీగ్‌లో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రబడ (25)ను అందుకునే అవకాశం ఉంది. తాహిర్ స్పిన్ మాయకు ప్రత్యర్థుల దగ్గర జవాబే ఉండటం లేదు.