అమ్మాయిలూ అదరగొట్టారు

International Womens Cricket Team is a great success - Sakshi

తీవ్ర దుమారం రేపిన టి20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ వివాదం తర్వాత... ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు దుమ్మురేపింది. ఒక రోజు ముందు పురుషుల జట్టు ఏ విధంగానైతే సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిందో... అదేచోట, అదే తరహాలో చెలరేగి ఆడి ఆతిథ్య న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. తొలుత స్పిన్‌త్రయం విజృంభించి ప్రత్యర్థిని కుప్పకూల్చగా... తర్వాత ఓపెనింగ్‌ ద్వయం విరుచుకుపడి సునాయాసంగా జట్టును లక్ష్యానికి చేర్చింది.   

నేపియర్‌ : భారత మహిళల క్రికెట్‌ జట్టు కివీస్‌ పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్‌లో స్పిన్నర్లు ఏక్తా బి‹ష్త్‌ (2/32), పూనమ్‌ యాదవ్‌ (3/42), దీప్తి శర్మ (2/27) మాయాజాలం... బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (104 బంతుల్లో 105; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత శతకానికి తోడు జెమీమా రోడ్రిగ్స్‌ (94 బంతుల్లో 81; 9 ఫోర్లు) దుమ్మురేపడంతో గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు టీమిండియా స్పిన్నర్ల ధాటికి 48.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (54 బంతుల్లో 36; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. స్మృతి, జెమీమా జోరుతో 33 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి భారత్‌ లక్ష్యాన్ని అందుకుంది. రెండో వన్డే ఈ నెల 29న మౌంట్‌ మాంగనీలో జరుగుతుంది. 

మంత్రం వేసిన స్పిన్‌ త్రయం 
ఓపెనర్లు బేట్స్, సోఫీ డివైన్‌ (38 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) నిలకడతో కివీస్‌ ఇన్నింగ్స్‌ సాఫీగానే ప్రారంభమైంది. తొలి వికెట్‌కు వీరిద్దరు 61 పరుగులు జోడించారు. అయితే, డివైన్‌ను రనౌట్‌ చేసి దీప్తి శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. లారెన్‌ డౌన్‌ (0) పూనమ్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయింది. బేట్స్‌... దీప్తి బౌలింగ్‌లో వెనుదిరిగింది. ఈ దశలో కెప్టెన్‌ సాటర్‌వైట్‌ (45 బంతుల్లో 31; 3 ఫోర్లు), అమెలియా కెర్‌ (60 బంతుల్లో 28) కాసేపు పోరాడారు. వీరిద్దరిని పెవిలియన్‌ పంపి పూనమ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తర్వాత బి‹ష్త్‌ ప్రతాపం చూపడంతో మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. హనా రౌయీ (25) పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

వారిద్దరే కొట్టేశారు 
ఛేదనలో స్మృతి, జెమీమా ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన వీరు తర్వాత ఓవర్‌కు కనీసం ఒక ఫోర్‌ చొప్పున కొడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. స్మృతి... హడెల్‌స్టన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదింది. 43 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో పూర్తి సహకారం అందించిన జెమీమా 61 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకుంది.  వీరి దూకుడుతో టీమిండియా స్కోరు 18వ ఓవర్లోనే వంద దాటింది. అనంతరం ఈ ఇద్దరు తడబాటు లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించారు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి... లక్ష్యానికి మూడు పరుగుల ముందు కెర్‌ బౌలింగ్‌లో ఔటైంది. జెమీమా విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top