ముగ్గురు మొనగాళ్లు 

Indias deadly trio Bumrah Shami Ishant - Sakshi

చక్రం తిప్పిన భారత పేస్‌ బౌలింగ్‌ త్రయం

అదరగొట్టిన బుమ్రా, షమీ, ఇషాంత్‌ శర్మ

భారత జట్టు ఇలా ఎలా విజయం సాధించగలిగింది? విదేశీ గడ్డపై ఇంతగా ఎలా బెంబేలెత్తించగలిగింది? అదీ ఆస్ట్రేలియాలాంటి చోట వారికంటే మెరుగైన బౌలింగ్‌ ఎలా సాధ్యమైంది? అసలు ఇదంతా వాస్తవమేనా... సగటు క్రికెట్‌ అభిమానికి వచ్చే సందేహాలే ఇవి. కానీ ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల తర్వాత అందరికీ సమాధానం లభించింది. భారత పేస్‌ బౌలర్లు అన్ని రంగాల్లో కంగారూ పేసర్లకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వేళ విజయం పరుగెత్తుకుంటూ వచ్చి వాలింది. ఆసీస్‌ పేసర్లతో పోలిస్తే పడగొట్టిన వికెట్లు, బంతిని స్వింగ్‌ చేసిన తీరు, గుడ్‌లెంగ్త్‌ బంతులు, సరిగ్గా వికెట్లపైకి దూసుకొచ్చిన బంతులు... ఇలా ఏ అంశం తీసుకున్నా మన ‘ముగ్గురు మొనగాళ్లు’ ప్రత్యర్థి ఫాస్ట్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు.

బుమ్రా, షమీ, ఇషాంత్‌ శర్మల ప్రదర్శన ముందు స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌ చిన్నబోయారు!  అయితే ఇది ఆస్ట్రేలియాలోనే మొదలు కాలేదు. 2018లో మూడు ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనల్లో సత్తా చాటి భారత్‌ను గెలిపించగలరని భావించిన మన పేసర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. విదేశాల్లో 11 టెస్టు మ్యాచ్‌లు... ఇందులో 4 విజయాలు... భారత టెస్టు చరిత్రలో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్న కాలంలో కూడా టీమిండియా ఒకే ఏడాది విదేశాల్లో ఇంత మంచి ప్రదర్శన కనబర్చలేకపోయింది.   ఈ ఏడాది విదేశాల్లో భారత జట్టు గెలిచిన నాలుగు టెస్టుల్లో పేసర్ల ప్రదర్శనను విశ్లేషిస్తే... జొహన్నెస్‌బర్గ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగితే... రెండో ఇన్నింగ్స్‌లో షమీ 5 వికెట్లు తీసి ప్రత్యర్థి పని పట్టాడు. నాటింగ్‌హామ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 161 పరుగులకే కుప్పకూల్చి విజయానికి బాటలు పరచడంలో 5 వికెట్లతో హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ బుమ్రా తన సత్తా చాటాడు. 5 వికెట్లు తీసి తన విలువేంటో చూపించాడు. అడిలైడ్‌ టెస్టులో ఐదు వికెట్ల ఘనతలు లేకపోయినా మన ముగ్గురు పేసర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి పట్టు చేజారకుండా ఉంచగలిగారు. ఇక మెల్‌బోర్న్‌లో అయితే బుమ్రా మెరుపులకు ఇషాంత్, షమీ జోరు కూడా తోడైంది. 1991–92 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఐదు టెస్టుల్లో కలిపి భారత పేసర్లు 57 వికెట్లు తీస్తే ఇప్పుడు మూడు టెస్టుల్లోనే 47 వికెట్లు పడగొట్టడం విశేషం. గతంలో విదేశాల్లో భారత్‌ ఎప్పుడు పర్యటించినా ఒకరు లేదా ఇద్దరు పేసర్లు ఉండటం, వారిలోనూ ఒకరి వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే హైలైట్‌ అయ్యేవి. ఇంత సమష్టిగా ఒకరితో మరొకరు పోటీ పడి రాణించడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అది సాధ్యం కావడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయి.  

బౌలర్లతో సమావేశం జరిగేటప్పుడు నేను వాళ్లు చెప్పిందే వింటాను. విదేశాల్లో టెస్టులు గెలవాలంటే వారు తమ ఆలోచనల ప్రకారం మ్యాచ్‌ దిశను నడిపించాలని నేను భావిస్తా. మా పేసర్ల బౌలింగ్‌ చూస్తుంటే కెప్టెన్‌గా చాలా గర్వపడుతున్నా. వారంతా ఎంతో బాధ్యత తీసుకోవడంతో పాటు తమ సత్తాపై నమ్మకంతో చెలరేగిపోయారు. ఇదంతా వారి సమష్టి ప్రదర్శన వల్లే సాధ్యమైంది’                
 –విరాట్‌ కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top